Ramoji Groups Chairman Ramoji Rao Charity: ప్రజలకు యథార్థ సమాచారన్ని అందించడంతోపాటు సమాజానికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ముందు నిలిచేవారు రామోజీరావు. సామాజిక బాధ్యతను తన భుజాలకెత్తుకొని ఆపన్నులకు అండగా నిలుస్తూ వచ్చారు. ఏదైనా ఘోర విపత్తు సంభవించినప్పుడు మా వంతు సాయం అంటూ మొట్టమొదటిగా ఈనాడు ద్వారా సాంత్వన కలిగించే వారు. పదాన్యులైన ప్రజలనూ ఆపన్న హస్తం అందించాలంటూ అభ్యర్థించేవారు. సాయం చేసే చేతులు- ప్రార్థించే పెదవులు రెండూ ఆయనే అయ్యేవారు.
ఈ క్రమంలో ఈనాడు పిలుపునిచ్చిందే తడవుగా దేశవిదేశాల నుంచి లక్షలాది మంది నుంచి విరాళాలు వెల్లువెత్తుతాయి. పెద్ద మనసులు చెక్కుల రూపంలో రెక్కలు కట్టుకొని వాలతాయి. చిన్నారి చేతులు తమ కిడ్డీ బ్యాంకులతో ఈనాడు సహాయనిధిని సుసంపన్నం చేస్తాయి. రామోజీ పిలుపునందుకున్న నిరుపేద సైతం రూపాయి రూపాయి పోగుచేసి, తమ గొప్ప మనసును చాటుకునేవారు.
ఈనాడు స్థాపించిన నాటి నుంచే వార్తల విషయంలోనే కాదు విరాళాల విషయంలోనూ రామోజీరావు అంతే నిబద్ధతతో వ్యవహరించారు. ప్రజలు ఇచ్చిన ప్రతి పైసానూ సద్వినియోగం చేసి చితికిన బతుకుల్లో చిరుదీపాలు వెలిగించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, తమిళనాడు, గుజరాత్‌లోని అనేక కల్లోల పీడిత గ్రామాల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచారు. గూడు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు, చిన్నారులకు చదువులు చెప్పేందుకు పాఠశాల భవనాలు నిర్మించారు.
రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao Biography
1976లో మూడు తుపానులు విరుచుకుపడి ఎంతోమంది జీవితాల్లో విషాదం నింపినప్పుడు తన వంతు సాయంతోపాటు ఈనాడు ద్వారా విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. 1977లో దివిసీమ ఉప్పెన కృష్ణా జిల్లాల్లో పాలకాయతిప్ప గ్రామాన్ని ముంచేసింది. ఊరిలో సగం మందికిపైగా మృత్యువాత పడ్డారు. మిగతావారు సర్వం కోల్పోయి బతుకడమే భారమైంది. ఇక్కడి దయనీయ స్థితిపై గమనించిన రామోజీరావు తక్షణ సాయం ప్రకటించి విరాళాలకు పిలుపునిచ్చారు.
అప్పట్లోనే 3లక్షల 73వేల 927 రూపాయలు సమకూరగా రామకృష్ణ మిషన్ ద్వారా 112 ఇళ్లు నిర్మించారు. 1986లో గోదావరి జిల్లాల్లో వరదలు పోటెత్తగా ఈనాడు ద్వారా 50వేల ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 1996లో కోస్తా జిల్లాల్లో పెనుతుపాను బీభత్సం సృష్టించగా సొంత నిధులు 25లక్షలు సహా విరాళాల ద్వారా వచ్చిన మొత్తం కోటీ ఆరు లక్షల రూపాయలతో ఐదు జిల్లాల్లో 42 పాఠశాలలు నిర్మించారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపే ఆ భవనాలకు సూర్య భవనాలుగా నామకరణం చేశారు. వాటిద్వారా విద్యాకిరణాలు ప్రసరిస్తున్నాయి.
కష్టం ఎక్కడ వచ్చినా దానికి భాష, ప్రాంతం, మతం ఇవేవీ ఉండవు. సాయం చేసే మనసు కూడా అంతే. 1999లో ఒడిశాలో తుపాను బీభత్సం సృష్టించినప్పుడు కూడా రామోజీరావు సామాజిక బాధ్యతను తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. తన వంతుగా 10లక్షల రూపాయల విరాళం ప్రకటించగా రామోజీ పిలుపుతో దాతలు తమ వంతు సాయం అదించారు. 45లక్షల 83వేల 148 రూపాయలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా 60 పక్కా గృహాలు నిర్మించి నిరాశ్రయులకు భవితపై భరోసా కలిగించారు.
2001లో గుజరాత్‌లో భూకంపం సృష్టించిన విలయం మాటలకందని విషాదం మిగిల్చింది. దేశ చరిత్రలోనే ఓ కన్నీటి చారికగా మారింది. అప్పుడూ రామోజీరావు మానవతా దృక్పథంతో స్పందించారు. తక్షణమే 25లక్షలు విరాళం సహా మానవతా వాదులు అందించిన మొత్తం 2కోట్ల 22లక్షల రూపాయలతో స్వామినారాయణ్ ట్రస్టు ద్వారా 104 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. 2004లో తమిళనాట సునామీ రూపంలో ప్రకృతి ప్రకోపించింది. ఈ విషాద సమయంలోనూ రామోజీరావు ముందుకొచ్చారు.
రామోజీరావు కీర్తి అజరామరం: చంద్రబాబు - Chandrababu On Ramoji Rao Demise
25లక్షలు సాయం ప్రకటిస్తే మనసున్న వాళ్లు ఆ మొత్తాన్ని రెండున్నర కోట్లు చేశారు. తమిళనాట బాగా దెబ్బతిన్న కడలూరు, నాగపట్టణాల్లో 164 ఇళ్లు నిర్మించి బాధితులకు అందించారు. 2009లో తుంగభద్ర నదికి వరదలు పోటెత్తి కర్నూలు, మహబుూబ్‌నగర్‌లోని నదీ తీర ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఆపన్నులకు అండగా నిలిచేందుకు ఈనాడు లక్షా 20 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసింది. కోటి రూపాయలమేర విరాళం ప్రకటించడంతోపాటు ఈనాడు ద్వారా మొత్తం 6కోట్ల 5లక్షల 58వేల 662 రూపాయలు సేకరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి 110 చేనేత కుటుంబాలకు మరమగ్గాలు అందించారు. కర్నూలు జిల్లాలో 7 పాఠశాల భవనాలు నిర్మించారు. ప్రకాశం జిల్లాలో 1991, 1992, 1996, 1997లో వచ్చిన వరదలకు పలు చోట్ల ఇళ్లు, పాఠశాల భవనాలు కూలిపోయాయి. అన్ని సందర్భాల్లోనూ ఈనాడు ముందుకొచ్చి పాఠశాల భవనాలు నిర్మించి విద్యార్థుల చదువుకు భరోసా ఇచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతపరంగానూ రామోజీరావు తన ఉదారతను చాటుకున్నారు.
సంస్థ నిధులతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించి, ఆయా విభాగాల అధికారులకు అందించారు. ఆంధ్రప్రదేశ్ లోని పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్ పల్లిని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవడం ఆ పల్లెల రూపురేఖల్నే మార్చేసింది. రోడ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్థుల జీవనశైలిని మెరుగుపరిచింది. కర్నూల్ జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం, తెలంగాణలోని అబ్దుల్లాపుర్ మెట్లో కట్టించిన పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఇబ్రహీంపట్నంలో నిర్మించిన ఆర్డీవో కార్యాలయం రామోజీ గ్రూప్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా ఉదాహరణలు.