Media Mogul Ramoji Rao Samsmarana Sabha Arrangements :కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో అక్షరయోదుడు రామోజీరావు సంస్మరణ సభ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం ఏర్పాట్లును మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు.
రామోజీరావు విశిష్ట సేవలకు గుర్తింపు : ఈనాడు పత్రికతో పాటు ఈటీవీ చానెళ్లతో రామోజీరావు మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు. మధ్య తరగతి ప్రజలకు మార్గదర్శితో ఆర్థిక భరోసా కల్పించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు అందించారు. ప్రపంచంలోనే అరుదైన రామోజీ ఫిలింసిటీ ద్వారా గిన్నస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రకృతి విపత్తుల్లోనూ ప్రజలకు వెన్నంటే నిలిచారు. రామోజీరావు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ సభను నిర్వహిస్తోందని మంత్రులు తెలిపారు.
రామోజీరావు సంస్మరణ సభ కోసం పటిష్ట బందోబస్తు : మంత్రి కొలుసు - Kolusu on Ramoji Memorial Service
అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు :రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కూడా వస్తుండటంతో మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ప్రధాన వేదిక, మూడు తాత్కాలిక భారీ గుడారాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10వేల మంది వరకు కుర్చునేందుకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆశీనులు కానున్నారు.