Heavy Rainfall in Hyderabad: జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, ఘట్‌కేసర్, ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ తదితర అనేక ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు మాన్‌సూన్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు.
రాంనగర్ ప్రాంతంలో వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఓ కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారులో నలుగరు ఉండడం గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి కాపాడారు. యూసుఫ్‌గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లోనూ వరద నీటి ప్రవాహానికి వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. నాచారంలో కురుస్తున్న కుండపోత వర్షానికి పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరు ప్రయాణించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సినిమా థియేటర్లో వాననీరు : పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి సినిమా థియేటర్లో వాననీరు కురుస్తున్నా సినిమాని యాజమాన్యం నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. సినిమా యాజమాన్యం దురుసుగా సమాధానం ఇవ్వడంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. మియాపుర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్ గచ్చిబౌలిలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.