ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం - ఉత్తరాంధ్రలో వర్షాలు! - RAIN ALERT TO AP

మంగళవారానికి వాయుగుండం - మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Rain Alert to AP
Rain Alert to AP (ETVBharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 7:08 PM IST

Rain Alert to AP: ఒక వారం రోజుల వ్యవధిలోనే బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం (LOW PRESSURE IN BAY OF BENGAL) ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారానికి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది.

పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారిన తరువాత, బుధవారం నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత తుపాను వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24న ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్టోబరు 24, 25న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబరు 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 45 నుంచి 65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుంది. అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని, తుపాన్​గా ఏర్పడిన తరవాత ఈ నెల 24 , 25న కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రభావం చూపిస్తోందని విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

"తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ రేపటికి పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అది 23వ తేదీకి తుపానుగా బలపడే అవకాశం కూడా ఉంది. ఒడిశా-బంగాల్‌ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతానికి తుపాను చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కూడా రావచ్చు. తుపాను దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్తున్నాము. అదే విధంగా ఎవరైతే ఇప్పటికే వెళ్లారో వారిని వారందరినీ వెనక్కి రావాలని కోరుతున్నాం. అదే విధంగా ఒడిశా ప్రాంతంవైపు కూడా ఎవరినీ వేటకు వెళ్లొద్దని చెప్తున్నాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 24 నుంచి గంటకు 100 కిలీమీటర్లు పైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది". - KVS శ్రీనివాస్, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి

కేంద్రం ఫోకస్​: అమరావతి- బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనున్న దృష్ట్యా కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్​లో కేంద్ర కార్యదర్శులు, డిఫెన్స్, డిజి ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డిజి ఐఎండి పాల్గొన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు పాల్గొనగా ఏపీ నుంచి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తుపాను హెచ్చరిక నేపథ్యంలో తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసినట్లు తెలిపారు.

అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసినట్లు, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామని స్పష్టం చేశారు. ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ ఆటంకం కలిగితే వెంటనే పునరుద్ధరణ కోసం అందుబాటులో సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌ నుంచి వాతావరణ పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు.

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం - తుపానుగా మారే అవకాశం - వాతావరణ శాఖ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details