Rain Alert to AP : బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కి తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబరులో నైరుతి రుతుపవనాలు తిరోగమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశించే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇటువంటి సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, అవి క్రమేపీ వాయుగుండాలు, తుపాన్లుగా మారతాయి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది తీవ్ర వాయుగుండం, తర్వాత తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో 11 తుపాన్లు ఏర్పడగా, అందులో 6 ఏపీలోనే తీరం దాటాయి.
మరోసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం:బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొన్న ప్రాంతం నుంచి చెన్నై తీరం వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. వీటి ప్రభావంతో ఒక్కసారిగా తీవ్రత పెరిగే ప్రమాదముందని తెలుస్తోంది. మరోవైపు అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. అక్కడి నుంచి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకూ ద్రోణి కొనసాగుతుంది. సెప్టెంబరు నెలలో ఇదే విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం, అరేబియా సముద్రంపై కదులుతున్న తుపాను ప్రభావంతో రుతుపవన ద్రోణి ఏర్పడి విజయవాడ నగరంలో కుంభవృష్టి కురిసింది. మరోసారి అదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.