Peddireddy Name in Madanapalle Files Burning Case: మదనపల్లె దస్త్రాల దహనం కేసులో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి. డీ పట్టా, ఫ్రీ హోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఆధారాలు ధ్వంసానికి, అవినీతి దందాలు తొక్కిపెట్టేందుకు పెద్దిరెడ్డి పీఏ ముని తుకారాం, ఆయన అత్యంత సన్నిహిత అనుచరుడైన వంకరెడ్డి మాధవరెడ్డిలు రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ద్వారా ఫైళ్లకు నిప్పంటించినట్లు దర్యాప్తులో తేలింది. మాధవరెడ్డి, ముని తుకారాంలు మరికొంత మందితో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడైంది. పెద్దిరెడ్డి ఆదేశాలతో పాటు ఆయన అండదండలతోనే ఈ కుట్ర చేశారనే ఫిర్యాదులు, ఆరోపణలున్నాయి.
7 నెలలవుతున్నా అమెరికాలోనే: మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఇప్పటికే అరెస్టైన గౌతమ్ తేజ రిమాండ్ రిపోర్టులో పలుచోట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుంది. ఈ కేసులో నాలుగో నిందితుడు ముని తుకారాం ఘటన జరిగిన వెంటనే గతేడాది జులైలో అమెరికాకు పారిపోయారు. 7 నెలలవుతున్నా సీఐడీ అధికారులు అతన్ని వెనక్కి రప్పించలేకపోయారు. ఆ దిశగా గట్టి ప్రయత్నమూ లేదు. మూడో నిందితుడు మాధవరెడ్డి మదనపల్లెలో తిరుగుతున్నా విచారించలేదు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఎవరికి లబ్ధి కలిగించేందుకు ఈ అక్రమాలకు పాల్పడ్డారు? ఎవరి ఆదేశాలు, అండదండలతో దస్త్రాల దహనానికి పూనుకున్నారు? పెద్దిరెడ్డి ప్రమేయం ఎలా ఉంది అనేది తేలనుంది. కానీ సీఐడీ ఆ దిశగా చురుగ్గా వ్యవహరించట్లేదన్న విమర్శలు ఉన్నాయి.
మదనపల్లె ఫైళ్ల దహనం కేసు - ప్రధాన నిందితుడు గౌతమ్‌తేజ్ అరెస్ట్
వారిద్దరి మధ్య 331 ఫోన్‌కాల్స్: దస్త్రాల దహనం కుట్రదారుల్లో ఒకరైన మాధవరెడ్డి ఈ ఘటన జరగటానికి ముందు గౌతమ్ తేజతో 10 రోజుల పాటు 7 సార్లు ఏకంగా 510 నిమిషాల పాటు ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా వెల్లడైంది. గతేడాది జులై 21వ తేదీన ఈ ఘటన జరగ్గా, జులై 11 నుంచి 20వ తేదీ మధ్య వారి మధ్య ఫోన్‌కాల్స్ నడిచాయి. మాధవరెడ్డికి, పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. నిరంతరం పెద్దిరెడ్డితో ఆయన సంప్రదింపుల్లో ఉండేవారు. 2023 జులై 1 నుంచి 2024 అక్టోబరు 17 మధ్య మాధవరెడ్డి, పెద్దిరెడ్డి మధ్య 52 ఫోన్‌కాల్స్; మాధవరెడ్డి, పెద్దిరెడ్డి పీఏ ముని తుకారాం మధ్య 331 ఫోన్‌కాల్స్ నడిచినట్లు తేలింది. ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ నడిచాయి. వారి మధ్య పెనవేసుకున్న బంధానికి ఈ వివరాలే నిదర్శనం.
నిషేధిత జాబితాలోని భూముల్ని ఫ్రీహోల్డ్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ 2023 డిసెంబరు 19న వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో 596 జారీ చేసింది. ఈ నిర్ణయం బయటి ప్రపంచానికి తెలియడానికి కొన్ని నెలల ముందే పెద్దిరెడ్డి పీఏ ముని తుకారాం తన సన్నిహితులతో కలిసి మదనపల్లె రెవెన్యూ డివిజన్, ఇతర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలతో జాబితా రూపొందించారు. కానీ నిషేధిత భూముల ఫ్రీహోల్డ్‌కు వీలు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందనే విషయం ముని తుకారాం, మాధవరెడ్డిలకు చాలా ముందుగానే ఎలా తెలిసిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ వెంటనే వారు అలాంటి భూముల అన్వేషణ ఎలా చేశారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో, పార్టీలో నంబర్-2గా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు లేకుండా ఇది సాధ్యమవుతుందా అన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది.
ఉద్దేశపూర్వకంగానే నిప్పు - మదనపల్లె ప్రమాదం వెనుక కుట్ర
తుకారాంకు అత్యంత రాజకీయ పలుకుబడి: మాధవరెడ్డి, ముని తుకారాం ఇద్దరూ అప్పటి మదనపల్లె ఆర్డీవో ఎం.ఎస్.మురళిని కలిసి వారి వద్దనున్న చుక్కల భూములు, డీకేటీ భూములు, ప్రభుత్వ భూముల సమాచారమిచ్చి, జీవో వస్తే నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశమున్న భూముల సర్వే నంబర్ల వివరాలను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా తీసుకున్నారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి పీఏగా ముని తుకారాంకు అత్యంత రాజకీయ పలుకుబడి ఉంది. ఆ బలంతో రెవెన్యూ అధికారులను మేనేజ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు, మంత్రి పీఏ అడిగినంత మాత్రాన ఆర్డీవో స్థాయి అధికారి ఫ్రీహోల్డ్‌కు అవకాశమున్న భూముల సర్వే నంబర్లు ఎలా ఇచ్చేస్తారు? అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు లేకుండా ఆర్డీవో అంతటి సాహసం చేయగలరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆర్డీవో ఇచ్చిన వివరాల ఆధారంగా ముని తుకారాం, మాధవరెడ్డిలు సంబంధిత రైతులు, యజమానులను కలిసి, వారిని మోసగించి ఆ భూముల్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుని, స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. రాజకీయ పలుకుబడితో కొన్నిచోట్ల, బెదిరించి మరికొన్ని చోట్ల భూములు లాగేసుకున్నారు. జీవో 596 విడుదలైన తరువాత ఆ భూములను అధిక ధరలకు విక్రయించి భారీగా లబ్ధి పొందారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు, ఆదేశాలు లేకుండా ఆయన పీఏ, ప్రధాన అనుచరుడు ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టగలరా? ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో పెద్దిరెడ్డి పాత్ర లేకుండా ఉంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పెద్దిరెడ్డి ఆదేశాలు లేకుండా సాధ్యమవుతుందా?: జీవో 596 ప్రకారం మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో 48 వేల 360.12 ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 22 వేల 523.50 ఎకరాల భూమి నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిందే. ఈ అక్రమాలు ఆర్డీవో ఎం.ఎస్.మురళి హయాంలోనే జరిగాయి. నిషేధిత జాబితాలోని 14 వేల ఎకరాల భూములను మాధవరెడ్డి, ముని తుకారాం, ఇతర రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు, వారి బినామీల పేరు మీద ఆర్డీవో మురళి రెగ్యులరైజ్ చేశారు. వేల ఎకరాల భూముల్ని ఆర్డీవో స్థాయి అధికారి మంత్రి పీఏ, అనుచరుడు చెప్పారని రెగ్యులరైజ్ చేసేస్తారా? పెద్దిరెడ్డి ఆదేశాలు లేకుండా ఇది సాధ్యమవుతుందా? వీటి అంతిమ లబ్ధిదారు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కాకపోతే మరెవరన్న ప్రశ్నలకు సీఐడీ తన దర్యాప్తు ద్వారా సమాధానం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది.