అసోంలో రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రకు అడ్డంకులు తెలంగాణలో కాంగ్రెస్ నేతల నిరసనలు Rahul Gandhi Yatra Assam :మణిపుర్ రాహుల్‌గాంధీ ప్రారంభించిన భారత్ న్యాయ్ యాత్ర అసోం మీదుగా కొనసాగుతోంది. సోమవారం నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని రాహుల్‌గాంధీ సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారు. భారత్ న్యాయ్ యాత్రకు అడుగడునా అడ్డంకులు సృష్టించడం శోచనీయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని హితవు పలికారు. రాహుల్ భద్రతపైనా అసోం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
విద్వేషాలు తగ్గించి ప్రేమను పెంచేందుకు యాత్ర చేస్తుంటే అడ్డుకోవడం సిగ్గుచేటని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. జాతిని ఐక్యం చేసే యాత్రపై దాడులకు దిగటం హేయమైన చర్యగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభివర్ణించారు. బీజేపీ తీరుకు నిరసనగా జగిత్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. రాహుల్‌గాంధీకి మద్దతుగా వేములవాడలో కాంగ్రెస్ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహంకాళి ఆలయం నుంచి రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ బాషీర్‌బాగ్‌లోని జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్‌మున్షి పాల్గొన్నారు.
"బీజేపీకి చెందిన రౌడీలు గూండాయిజంతో న్యాయ్ యాత్రలో పాల్గొంటున్నావారిని అడ్డుకొని, ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు. ప్రజల దగ్గరకు వెళ్లి ఒక నమ్మకాన్ని, విశ్వాశాన్ని కలిగించే ప్రయత్నంలో, భద్రతా కలిగించే విషయంలో కూడా ఆయా రాష్ట్రాలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీ కూడా తన జీవితాన్ని ప్రజలకు అర్పిస్తానని ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తున్నారు." - శ్రీధర్‌బాబు, ఐటీ శాఖ మంత్రి
Telangana Congress Leaders Fires on BJP: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. భారత్ న్యాయ యాత్రకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఖమ్మంలో మాజీ ఎంపీ హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఆలయంలోకి రాహుల్ వెళ్లకుండా ఆపినందుకు అసోం ప్రభుత్వంపై, బీజేపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పేదవారికి సరైన న్యాయం జరగాలని బాబా సాహెబ్ అంబేడ్కర్ ర్యాజ్యాంగం రాశారో దాని ప్రకారం ప్రభుత్వాలు నడవడం లేదు. రాహుల్ గాంధీకి గిరిజనులంతా స్వాగతం పలుకడం చూడలేక యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు." - వి.హనుమంతరావు, మాజీ ఎంపీ