Raghu Rama Krishna Raju on BJP MP List: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. తాజా పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని, మెసేజ్‌లు పంపారని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నాననీ చెప్పడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా రఘురామకృష్ణరాజు వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
జగన్ ఇంత పని చేస్తారని తెలిసినా: జగన్‌మోహన్‌రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, బీజేపీ నుంచి తనకు టికెట్ రానివ్వరని ముందే పిల్ల సజ్జల వెబ్‌సైట్లు, మీడియా ఛానల్స్‌లో చెప్పారని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. జగన్ తనను డిస్‌క్వాలిఫై చేయాలని చూశారని, జైల్లో చంపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తన మతానికి చెందిన అధికారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడి ప్రభుత్వ అధినేతలతో కుమ్మక్కై తనను అక్రమంగా అరెస్టు చేయించి, జైలులోనే చంపేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిలో విఫలమయ్యారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని లేపేయాలని చూశారని, ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదని అన్నారు. తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారని, అపజయాన్ని అంగీకరిస్తున్నానని తెలిపారు. జగన్ ఇంత పని చేస్తారని తెలిసినా, ఏ మూలనో ఒక నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నానని చెప్పారు.
లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు - BJP MP Candidates List
జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వను: గత నాలుగేళ్లుగా జగన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేశానని రఘురామ గుర్తు చేశారు. ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేస్తున్నానని, రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయించి, జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు రఘురామ కాదని సవాల్ చేశారు. జగన్ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని, బీజేపీ నేత సోము వీర్రాజుకు, జగన్‌కు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేనని తెలిపారు. సోము వీర్రాజు ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తనకు తెలిసిందన్నారు. నరసాపురం నుంచి పోటీ చేస్తానా ? మరో స్థానం నుంచా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందన్న రఘురామ, జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వనని హెచ్చరించారు.