తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రిలో మోహన్​ బాబు - జల్​పల్లి ఘటనపై పోలీసు శాఖ సీరియస్ - NOTICES TO MANCHU MOHAN AND SONS

మోహన్‌బాబు ఇంటి వద్ద కొనసాగిన హైడ్రామా - జల్‌పల్లిలో జరిగిన దాడి ఘటనపై రాచకొండ సీపీ ఆగ్రహం - ఇవాళ విచారణకు రావాలని మోహన్‌బాబు, మనోజ్, విష్ణుకు నోటీసులు

MANCHU FAMILY ISSUE LATEST
NOTICE ISSUED TO MANCHU MOHAN BABU (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 7:34 AM IST

Manchu Family Issue : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోహన్​బాబు, మనోజ్​ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన ఈ వ్యవహారం ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో మోహన్​బాబుతో పాటు తన కుమారులైన మంచు మనోజ్​, విష్ణులకు రాచకొండ సీపీ సుధీర్​ బాబు అదనపు జిల్లా మేజిస్ట్రేట్​ హోదాలో నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

జల్​పల్లిలో జరిగిన దాడి ఘటనపై సీపీ ముగ్గురిని విచారణ చేయనున్నారు. జల్​పల్లిలోని మంచు మోహన్​బాబు ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై రాచకొండ సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మోహన్​బాబు, మనోజ్​లకు చెందిన తుపాకులను పోలీసులు సీజ్​ చేశారు. గచ్చిబౌలి ఆసుపత్రిలో మోహన్​బాబు చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగింది :మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో విదేశాల్లో ఉన్న విష్ణు మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి రావడంతో మోహన్‌బాబు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లి జల్‌పల్లిలోని నివాసానికి తీసుకొచ్చారు. అప్పటికి మనోజ్‌ అక్కడే ఉన్నారు. వివాదానికి తెరదించేందుకు మోహన్‌బాబు, విష్ణు, మరికొందరు సన్నిహితుల సమక్షంలో మనోజ్‌తో చర్చలు జరిగాయి. అయితే మనోజ్, తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకు వచ్చేశారు.

ఈ సమయంలో విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్‌ బౌన్సర్లను బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించారు. దీంతో గేటు దగ్గర కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మనోజ్‌, తాను ఆస్తి కోసం పోరాడటం లేదని, ఇది ఆత్మగౌరవం కోసమని వ్యాఖ్యానించారు. తన తరఫు వారిని కానిస్టేబుళ్లు బెదరగొట్టి ఇంటి నుంచి బయటకు పంపించారని, ఇతరుల అంగరక్షకులను లోపలికి పంపించారని ఆరోపించారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని సాయంత్రం ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌లకు మనోజ్‌ ఫిర్యాదు చేశారు.

పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో జల్‌పల్లిలోని నివాసానికి మనోజ్‌ తిరిగి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేటును గట్టిగా నెట్టి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన మనోజ్‌, బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడిచేశారు.

మీడియా ప్రతినిధులకు గాయాలు : ఓ ఛానెల్‌ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్‌ కెమెరామెన్‌ కింద పడ్డాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

మోహన్‌బాబు నివాసంలో మంచు మనోజ్‌పై దాడి - జల్‌పల్లి వద్ద ఉద్రిక్తత

ఆస్తులు సమానంగా రాయాలా లేదా అనేది నా ఇష్టం - మనోజ్ నా పరువు మంటగలిపావు: మోహన్‌బాబు

ABOUT THE AUTHOR

...view details