Kummarigudem Milk Production : హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల సమీపంలోని గ్రామం కుమ్మరిగూడెం. అక్కడ ఇంటింటికీ కనీసం ఒక్క ఆవు అయినా ఉంటుంది. వాకిట్లో అడుగు పెడితే చాలు కాగుతున్న పాల సువాసన మన ముక్కును తాకుతుంది. మరో రెండడుగులు ముందుకు వేస్తే నెయ్యి ఘుమఘుమలు మనసును హత్తుకుంటాయి. ఈ గ్రామంలోనూ పదేళ్ల కిందటి వరకు రైతులు సాధారణ వ్యవసాయం చేసేవారు. పెట్టుబడి తగ్గించుకుని మంచి ఆదాయం సాధించాలన్న లక్ష్యంతో స్థానిక రైతు మారుపాక కోటి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు.
పాలేకర్ సాగు విధానంపై హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు. ఆయన ప్రతిభ, కృషిని ఆరేళ్ల కిందట హసన్‌పర్తి మండలంలోని మహర్షి గోశాల నిర్వాహకులు డాక్టర్ సర్జన రమేష్, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ గుర్తించారు. రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు, జర్మనీ దేశస్థురాలైన మోనికా రెటరింగ్‌ను వీరు కలిశారు. కుమ్మరిగూడెం రైతులకు సహాయ సహకారాలు అందించాలని గౌరవంగా విన్నవించారు. దాంతో ఆమె 30 కుటుంబాలకు ఒక్కో ఆవును సమకూర్చారు.
గ్రామంలో ఉత్పత్తయిన పాలను సేకరించడానికి పాలకేంద్రం ఏర్పాటు చేయించారు. నెయ్యి తయారీ చేసే యంత్రాన్ని సమకూర్చారు. పాడి కారణంగా వారి ఆదాయం కొంత కొంత పెరగడంతో ఊరు ఊరంతా ఆవులను పెంచడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ 60 కుటుంబాలుండగా, 200 వరకు ఆవులున్నాయి.