Pujitha of Vijayawada Yoga Trainer Defies Her Severe Illness to Bag Asia Yoga Championship :అస్తమా నుంచి బయటడేందుకు యోగా ప్రారంభించిందా యువతి. క్రమం తప్పకుండా ఆసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని దారిలోకి తెచ్చుకుంది. కానీ అక్కడితో ఆగిపోలేదు. తనలా ఎవ్వరు ఇబ్బంది పడొద్దని యోగా ట్రైనర్‌గా మారింది. ఏకంగా ఏషియన్ యోగా ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగాలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆ యోగా ట్రైనర్ స్టోరీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అలవోకగా ఆసనాలు వేయగలదు పూజిత. ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా చేయడం అలవాటు చేసుకుంది. క్రమంగా యోగా ఈమె దినచర్యలో భాగమైంది. తక్కువ వ్యవధిలోనే అనేక రకాల ఆసనాలు వేయడం నేర్చుకుని శిక్షకురాలిగా మారింది. అంతే కాదు, సింగపూర్‌లో జరిగిన ఏషియన్ యోగా ఛాంపియన్ షిప్‌లో పోటీల్లో 4వ స్థానంలో నిలిచింది.
కిలారు పూజిత స్వస్థలం విజయవాడ. చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. 9వ తరగతి చదువుతున్నప్పుడే ఫుట్‌బాల్, వాలీబాల్, త్రోబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో పతకాలు సాధించింది. అంతలో అస్తమా బారిన పడింది పూజిత. అప్పటివరకు ఆటలంటేనే ఎంతో చురుకుగా ఉండే తను తరచూ అనారోగ్యానికి గురయ్యేది. క్రీడలకు పూర్తిగా దూరమైంది.
'అస్తమా కారణంగా గాలి తీసుకోవడమే ఇబ్బందిగా మారింది. దీంతో 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను. అదే సమయంలో యోగా ద్వారా ఆస్తమా తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారు. అప్పటినుంచి ఆసనాలు, ప్రాణాయామం అలవాటు చేసుకున్నాను. క్రమం తప్పకుండా చేయడం వల్ల అస్తమా ప్రభావం తగ్గింది.'-పూజిత, యోగా శిక్షకురాలు