Mental Pressure in Students for Engineering Entrance Exams :ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఒక్కో సంస్థ ఒక్కో విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందుకు అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ఇంటర్ విద్యార్ధులు రెండో ఏడాదంతా ఒత్తిడిలోనే గడుపుతున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న మాదిరిగా ఇంజినీరింగ్‌కు సైతం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తున్నా అమల్లోకి రావడం లేదు. బీటెక్‌లో చేరేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల దరఖాస్తులకే 10 వేలకుపైగా ఖర్చవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన ఇంజినీరింగ్ కళాశాలలు తక్కువగా ఉండటంతో వాటిల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఒక దాంట్లో సీటు రాకపోతే మరో దాంట్లోనైనా సాధించాలన్న ఒత్తిడి పిల్లలపై ఉంటోంది. ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి కొంచెం మంచివి అనుకున్న వర్సిటీల్లో ఫీజులు అధికంగా ఉంటున్నాయి. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వస్తేనే రాయితీ ఇస్తామంటూ ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలు ప్రకటనలు చేస్తుండడంతో విధిగా వాటిని రాయాల్సి వస్తోంది.
అటు అకడమిక్ ఇటు పోటీ పరీక్షలకు : ఇంటర్ రెండో ఏడాది మొదటి నుంచే అటు అకడమిక్ ఇటు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సి వస్తోంది. జనవరి, ఏప్రిల్ నెలల్లో ఒకసారి జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికీ రాష్ట్రంలో చాలా మంది హాజరవుతున్నారు. తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఈఏపీసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఉంటున్నాయి. ఇవి పూర్తికాకుండానే బిట్స్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ వస్తుంది. ఈఏపీసెట్‌కు ముందే ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొంతమంది తెలంగాణ ఈఏపీసెట్‌ను సైతం రాస్తారు. వీటన్నింటికీ దరఖాస్తు చేసి, రాసేందుకు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.