DEVANAKONDA URANIUM MINING: యురేనియం తవ్వకాల విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో పర్యటించిన నేతలు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ధైర్యం చెప్పారు. యురేనియం తవ్వకాలు ఎక్కడా జరగట్లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసే ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం నేతలు అన్నారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. యురేనియం తవ్వకాలపై గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రజలకు వివరించడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి, కోడుమూరు, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు, ఆలూరు, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్లు వీరభద్ర గౌడ్ ప్రజలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి మాట్లాడుతూ యురేనియం తవ్వకాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై బురద వేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రజల కోసం పని చేస్తుందని, మీ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి యురేనియం తవ్వకాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.