Problem with YCP MLA Dharmana PA Murali :వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుత్తేదారుడికి రహదారి పనుల నిమిత్తం బిల్లులు చెల్లించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడంతో తనపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పీఏ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని గుత్తేదారు సింహాచలం ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం దంత నుంచి ఎస్టీ జరాలి వరకు పూర్తి చేసిన రహదారి నిర్మాణ పనులకు చెల్లించాల్సిన నిధులను చెల్లించకుండా ఎమ్మెల్యే పీఏ మురళి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెల్లించాల్సిన నిధులను గుత్తేదారు పేరు మార్చి అతని బినామీకి చెల్లించారని మండిపడ్డారు. తక్షణమే తనకు రావాల్సిన నిధులను చెల్లించాలని సింహాచలం డిమాండ్ చేశాడు.
అసలు ఏం జరిగిందంటే మండలంలోని దంత నుంచి జరాళి గ్రామం వరకు 2.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ నిధులు రూ.1.65 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2019 డిసెంబరు 30న రోడ్డు నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేయగా రహదారి పనులను అప్పటి వైసీపీ నేత కోన సింహాచలం చేపట్టారు. 2022 ఫిబ్రవరి 25 నాటికి రూ.39.11 లక్షల మేర పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. గతేడాది మార్చిలో గుత్తేదారుకు రూ.12 లక్షలకు పైగా చెల్లించారు. ఇటీవల సింహాచలం టీడీపీలో చేరారు. అతను చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఎమ్మెల్యే పీఏ మురళి సమీప బంధువు వెలమల కుమార్ ఖాతాకు రూ.21 లక్షల పైగా జమ చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు సహకరించారు. ఈ నెల 12న కుమార్ను గుత్తేదారుగా ధ్రువీకరించిన అధికారులు గత నెల 20న అతను పనులు చేసినట్లు ఎంబుక్లో నమోదు చేశారు.