YSRCP Government Neglected Bilva Swargam Caves in Nandyal District : మహోజ్వల చరిత్రకు సాక్షీభూతమైన గుహలు గత పాలకుల అనాలోచిత నిర్ణయంతో ప్రమాదంలో పడ్డాయి. లక్షల ఏళ్ల నాటి చరిత్రను చాటిచెప్పే తవ్వకాలను సిమెంటుతో కప్పేయడం పరిశోధకులను, పర్యాటకులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. విధ్వంసమే అజెండాగా సాగిన వైఎస్సార్సీపీ పాలనలో బిల్వస్వర్గం గుహల విశిష్టతను ఎలా నాశనం చేశారో తెలుసుకోవాలంటే నంద్యాల జిల్లాకు వెళ్లాల్సిందే.
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకిందకొట్టాల గ్రామ సమీపంలో బిల్వసర్గం గుహలు ఉంటాయి. మద్రాస్ ఆర్మీకి చెందిన కెప్టెన్ న్యూబొల్డ్ 1844లో లండన్ రాయల్ సొసైటీకి ఇచ్చిన సమాచారంతో ఈ గుహల ప్రాధాన్యం తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ-హిస్టరీగా పిలుచుకునే రాబర్ట్ బ్రూస్ ఫూట్ 1883లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్‌గా పని చేశారు. బ్రిటిష్ అధికారుల ప్రోత్సాహంతో కుమారుడు బ్రూస్ ఫూట్ జూనియర్‌తో కలిసి 1883 - 1885 మధ్య ఈ గుహల్లో తవ్వకాలు చేపట్టారు.
ఎర్రమలగుహల్లో ఆదిమానవుడి పెయింటింగ్స్ - దాచేస్తున్న మైనింగ్ మాఫియా
26 లక్షల ఏళ్ల నాటి అవశేషాలు : ఎలుక నుంచి ఖడ్గమృగం వరకు అనేక జంతువుల అవశేషాలను వెలికితీసి కోల్‌కతాలోని ఏసియాటిక్ సొసైటీకి పంపారు. జంతువుల అవశేషాలు 26 లక్షల ఏళ్ల నాటివిగా పరిశోధకులు గుర్తించారు. అక్కడే మధ్యరాతియుగపు మానవుల ఆనవాళ్లను సైతం కనుగొన్నారు. పూర్తిస్థాయి సర్వే చేసి చక్కటి మ్యాప్ రూపొందించిన బ్రూస్ ఫూట్, ఒక్కో భాగానికి ఒక్కో పేరు కూడా పెట్టారు. అప్పట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసి తర్వాత బ్రిటిష్ మ్యూజియం పురావస్తు శాస్త్రవేత్తగా బాధ్యతలు చేపట్టిన రిచర్డ్ లిడెకర్ బిల్వసర్గం గుహల ప్రాచుర్యం ప్రపంచవ్యాప్తం కావడానికి కారకులయ్యారు. అనంతరం 1920లలో కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన LA. కామియాడ్ ఆధార సహితంగా గుహల విశేషాలను వెలుగులోకి తెచ్చారు. తర్వాతి కాలంలో ఆల్చిన్ దంపతులు, KN ప్రసాద్, MLK మూర్తి, K. తిమ్మారెడ్డి లాంటి పరిశోధకులు గుహల నిర్మాణం, జంతుజాలం, ఆదిమానవుల ఆనవాళ్లపై అధ్యయనం చేశారు.