Prathidwani : హూ కిల్డ్ బాబాయ్ ? బాబాయిని ఎవరు చంపారు ? ఐదేళ్లుగా జవాబు దొరకని ప్రశ్న ఇది. సీఎం Y.S.జగన్‌మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపిన హంతకులెవరో అంతుచిక్కని రహస్యంలా మిగిలిపోయింది. ఇంటి దొంగల పనేనని వివేకా కుమార్తె సునీతారెడ్డి బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. అదే నిజమని దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ నిగ్గుతేల్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సూత్రధారి అంటూ అరెస్ట్ చేయడానికి సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కానీ ఇంతవరకు అరెస్ట్ జరగలేదు. ఇలాగైతే చట్టం, న్యాయంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందా? వివేకా హంతకులను ఎవరు కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు? అసలు సూత్రధారులు ఎవరు? అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో విశ్లేషకులు గోశాల ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమన్నారో విన్నారు కదా. గొడ్డలిపోటును గుండెపోటుగా ఎందుకు మార్చారు ? నారాసుర రక్తచరిత్ర అంటూ కట్టుకథలు ఎందుకు అల్లారు ? వివేకా హత్య ఎలా జరిగిందో సీన్ టూ సీన్ కళ్లకు కట్టేలా, అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్ ఎలా వివరించారో చూడండి అనే ప్రశ్నకు గోశాల ప్రసాద్ వివరించారు. జగన్ డిమాండ్‌ను చూశాం కదా. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను సీఎం కాగానే ఎందుకు ఉపసంహరించుకున్నారు? జగన్ చెప్పినట్లు ఒక కన్ను ఇంకో కంటిని పొడుచుకోలేదన్నది నిజమైతే వివేకా కుమార్తె సునీతారెడ్డి పోరాటంతో రంగంలోకి దిగిన సీబీఐని ఎందుకు ముప్పుతిప్పలు పెట్టారు? ఐదేళ్లలో సొంత బాబాయి హంతకుల్నే పట్టుకోలేని జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భద్రతకు ఎలాంటి భరోసా ఇవ్వగలిగింది? వంటి ప్రశ్నలకు గోశాల ప్రసాద్ సమాధానం ఇచ్చారు.