Power Usage Increased in Telugu States :తెలుగు రాష్ట్రాల్లోరోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందు నుంచే ఎండలు విజృంభిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వినియోగదారుల కరెంట్ వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. ఫిబ్రవరి, మార్చి వినియోగంతో పోలిస్తే ఏప్రిల్‌లో అసాధారణంగా వాడకం కనిపిస్తోంది. దీంతో అదే స్థాయిలో వినియోగదారుల విద్యుత్తు బిల్లులు పెరిగాయి. చేతికందిన బిల్లులు చూసి వినియోగదారుల గుండెలు గు'బిల్లు'మంటున్నాయి. వాడనైతే వాడాము కానీ ఇప్పుడు కడుతుంటే ఆ భారం తెలుస్తుందని అంటున్నారు.
కరెంట్ బిల్ భారీగా వస్తోందా ? అయితే ఈ టిప్స్ పాటించండి!
హైదరాబాద్ నగరంలోని తొమ్మిది విద్యుత్తు సర్కిళ్ల పరిధిలో ఎల్‌టీ వినియోగదారులు 60 లక్షల వరకు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కోసం ఇళ్లలో, కార్యాలయాలు, దుకాణాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో నీళ్ల కోసం మోటార్లు సైతం ఎక్కువ గంటలు పని చేశాయి. ఎండాకాలం కావడంతో నీటి వాడకమూ పెరిగింది. ఫలితంగా గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 4300 మెగావాట్లకు చేరింది. ఒకరోజు గరిష్ఠ వినియోగం 90 మిలియన్ యూనిట్లు నమోదైంది.