Students Parents Protest over Poor quality Food in Hospital : వసతి గృహాల్లోని విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి తీసుకువచ్చే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదు. నారాయణపేట మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో భోజనం వికటించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పెట్టిన అల్పాహారంలో పురుగులు రావడంతో తల్లితండ్రులు ఆందోళనకు గురయ్యారు. చికిత్స అందిస్తారని ఆస్పత్రికి వస్తే ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకువచ్చారంటా ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఇద్దరిపై వేటువేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై పూర్తివివరాలు సేకరించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నానాయక్, విద్యార్థులు, సిబ్బందిని కలిసి ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం పాఠశాలలోని వంట సామాగ్రి, బియ్యం, సరుకులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలలోని ఏజెన్సీని తొలగించి కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. సరుకుల నమూనా తీసుకొని ఆహార తనిఖీ శాఖకు నివేదించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇక నుంచి ప్రతి బడిలో ఆహారాన్ని ముందుగా పరిశీలించి విద్యార్థులకు అందజేస్తామని అన్నారు.
అల్పాహారంలోనూ పురుగులు : మధ్యాహ్న భోజనం వికటించి మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు అందించిన అల్పాహారంలోనూ పురుగులు రావడంతో పిల్లల తల్లిదండ్రులకు మళ్లీ ఆందోళనకు గురిచేసింది. అస్వస్థతతో చికిత్స కోసం వస్తే నాణ్యమైన భోజనం అందించకుండా ఇక్కడా పురుగుల అన్నం పెట్టారని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వాపోయారు. అల్పాహారంలో పురుగులు ఉన్నాయని ముందుగా ఓ విద్యార్థి గమనించి విధుల్లోని సిబ్బందికి చెప్పగా మిగతా విద్యార్థులు తినకుండా జాగ్రత్తలు పడినట్టు పేర్కొన్నారు.
'ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది వాంతులు చేసుకున్నారు. ఆసుపత్రిలో అల్పాహారంలో పురుగులు ఉన్నాయి. మళ్లీ వేరే అల్పాహారం తీసుకొచ్చి ఇచ్చారు. స్కూల్లో అన్నంలో పురుగులు, మళ్లీ ఆసుపత్రిలో కూడా పురుగులు ఉన్న అల్పాహారం పెట్టారు'- విద్యార్థులు