Guntur Girl Kidnap Case Updates :ఓ బాలిక చేసిన తప్పుడు ప్రచారం ఇటు తల్లిదండ్రులను, అటు పోలీసులను పరుగులు పెట్టించింది. చివరకి అదంతా డ్రామా అని తెలియడంతో వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మరి అసలేం జరిగిదంటే తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టేషన్‌లోకి ఓ అమ్మాయి వచ్చింది. ఓ ప్రయాణికుడి వద్దకు వెళ్లి తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి చెర నుంచి తప్పించుకుని వచ్చానని తెలిపింది. ఫోన్ ఇస్తే తన తల్లితో మాట్లాడతానని అర్థించింది. వెంటనే కంగారుగా అతను ఆమె తల్లి నంబర్‌ను తెలుసుకుని రింగ్ చేసి బాలికకు ఇచ్చాడు.
‘ఇంటి వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ అమ్మకు ప్రమాదం జరిగింది. వెంటనే బయల్దేరమని చెప్పి కారు ఎక్కించుకున్నారు. విజయవాడ తీసుకొచ్చి బస్టాండ్ వద్ద భోజనానికి కారు ఆపారు. వారు హోటల్‌కు వెళ్లారు. కారు లాక్ సరిగా వేయలేదని దీంతో తప్పించుకుని బస్టాండులోకి వచ్చినట్లు' బాలిక తల్లికి చెప్పింది. ఆమె కంగారుపడి విజయవాడలో ఉన్న సోదరికి విషయం చెప్పి బస్టాండ్‌కి వెళ్లమని కోరింది.
ఇంతలో ఆ ప్రయాణికుడు ఆ బాలికను బస్టాండ్‌లోని కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆర్టీసీ సిబ్బంది ఈ సమాచారాన్ని కృష్ణలంక పోలీసులకు చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సీసీ కెమెరాలు పరిశీలించడంతో గుట్టురట్టు :కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నట్లుగా ఆ అమ్మాయి చెప్పడంతో ఆ దిశగా కృష్ణలంక పోలీసులు విచారణ చేపట్టారు. బస్టాండ్ బయట భోజనం కోసం కారును కిడ్నాపర్లు ఆపిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీని నిశితంగా పరిశీలించిన పోలీసులు బాలిక చెప్పినట్లుగా ఆ ప్రాంతంలో కారు కానీ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కానీ లేవని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు విచారణ సమయంలో బాలిక పలు రకాలుగా పొంతన లేని సమాధానాలు చెప్పింది.