Police Village Annaram: ఆటలపై మక్కువతో పాటు తన ఉజ్వల భవిష్యత్తుపై ఆరాటం వెరసి ఆ గ్రామం నుంచి ఏకంగా 50 మంది పోలీస్ ఉద్యోగం సాధించారు. మరో 25 మంది హోంగార్డులు సైతం ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామం ప్రత్యేకత ఇది. ఈ గ్రామంలో మొత్తం జనాభా 6 వేల 225 మంది ఉన్నారు. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడే ఫ్యామిలీలే అధికం. మొట్టమొదటి సారిగా 1981లో ఏనుగుల అంజయ్య అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యారు. దీంతో ఈ ప్రస్థానానికి మొదటి అడుగు పడింది.
ఐటీఐ చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. మానకొండూర్ స్కూల్లో ఎన్‌సీసీ విభాగం ద్వారా అలవడిన క్రమశిక్షణ, ఆటలపై మక్కువ నాడు ఉద్యోగం ఎంపిక ప్రక్రియకు దోహదపడ్డాయని అంజయ్య తెలిపారు. అనంతరం 1992వ సంవత్సరంలో మరో అడుగు పడింది. ఆ సంవత్సరం మరో ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుళ్లుగా సెలక్ట్ అయ్యారు. అప్పటి నుంచి నుంచి ఆ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. కాస్త కష్టపడితే తాము కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని యువకులు గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఇకపై అన్ని 'పోటీ పరీక్షలు’ ఆఫ్‌లైన్‌లోనే! - డిసెంబరులోగా నియామకాలు పూర్తి
1995లో ఆ ఊరి నుంచి ఒక్కసారే నలుగురు యువకులు పోలీసు ఉద్యోగానికి సెలక్ట్ అయ్యారు. ఇదే స్ఫూర్తితో 1998వ సంవత్సరంలో నలుగురు, 2000వ సంవత్సరంలో ఆరుగురు, 2003వ సంవత్సరంలో ఇద్దరు, 2008వ సంవత్సరంలో నలుగురు, 2009వ సంవత్సరంలో నలుగురు, 2012వ సంవత్సరంలో నలుగురు, 2018వ సంవత్సరంలో ఆరుగురు, 2023వ సంవత్సరంలో ఆరుగురు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. వారికితోడు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో అయిదుగురు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ముగ్గురు ఉద్యోగం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన శంకర్ అనే హెడ్‌కానిస్టేబుల్ పోలీసు కావాలనే సంకల్పంతో ఉన్న యువతకు 6 సంవత్సరాల నుంచి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు.
అదే బాటలో మరింత మంది యువకులు:అన్నారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 250 మంది యువకులు పోలీస్ ఉద్యోగం కోసం ట్రై చేశారు. అందులో ఒకట్రెండు మార్కులతో సెలక్ట్కాని వారు సైతం ఉన్నారు. చివరిసారిగా జరిగిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఈ గ్రామం నుంచి 40 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. అందులో ఆరుగురు సెలక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఎంపికైన వారిలో పాకాల రాజిరెడ్డి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అవ్వగా, ఆరెల్లి రాజ్‌కుమార్ ఫింగర్‌ప్రింట్ విభాగంలో సీఐగా, మార్క రాజయ్య ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని ఇక్కడి యువత అంటున్నారు.
కష్టపడింది - కల నెరవేర్చుకుంది - గీతా భార్గవి విజయగాథ ఇది