Police Solved Businessman Kidnap Case: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఆక్వా వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కుట్రకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న ఆక్వా వ్యాపారి విశ్వనాథుని వెంకట సత్యనారాయణను కొందరు కారులో కిడ్నాప్ చేశారని డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య వెల్లడించారు. సత్యనారాయణ కుమారుడి ఫిర్యాదు మేరకు అప్రమత్తమై రంగంలోకి దిగినట్లు తెలిపారు. టోల్గేట్ల వద్ద సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించి బాధితుడిని అనంతపురం వైపు తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు.
అనంతపురం పోలీసుల సాయంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారిని భీమవరం తీసుకువచ్చి విచారణ జరిపినట్లు తెలిపారు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకే వడ్డీ వ్యాపారులు కిరాయి ముఠాతో ఈ కిడ్నాప్ చేసినట్లు స్పష్టం చేశారు. భీమవరానికి చెందిన సోమిశెట్టి ఆర్‌కే సత్యప్రసాద్, ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్‌బాబు నుంచి విశ్వనాథుని సత్యనారాయణ గతంలో తక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఆ తరువాత అసలు, వడ్డీ చెల్లించలేదు.
ఎన్నిసార్లు అడిగినా నో రెస్పాన్స్: 2021లో లెక్కలు చూసుకోగా రూ.10.70 కోట్ల మేర బకాయి పడినట్లు తేలింది. అప్పటినుంచి డబ్బు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా సత్యనారాయణ స్పందించలేదు. దీంతో ఆయనను బెదిరించి అప్పు వసూలు చేసుకోవాలని భావించారు. దీనిపై సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద ఉన్న రెస్టారెంట్ యజమాని ఆశిష్‌తో చర్చించారు. రూ.10 కోట్లు వసూలు చేస్తే 10 శాతం కమీషన్ ఇస్తామని చెప్పారు. దీంతో అశిష్ అతని స్నేహితుడు లోకేశ్ ద్వారా కిడ్నాప్‌నకు ప్లాన్ చేశాడు.