Police Solved a Case of Theft in Bus at Kavali:నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 77.50 లక్షల రూపాయల నగదును రికవరీ చేశారు. ఈ చోరీకి ప్రధాన కారణం నగదు తరలించిన వ్యక్తేనని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. నగదు తరలిస్తున్న వ్యక్తి పథకం ప్రకారం స్నేహితులతో కలిసి చోరీ చేసినట్లు తెలిపారు. చోరీ వివరాలను ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు.
చెన్నైలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హరినాథ్ రెడ్డి ఈ నెల 1వ తేదీన 80 లక్షల రూపాయల నగదుతో విజయవాడ నుంచి చెన్నైకి ఓ ప్రయివేటు బస్సులో బయలుదేరాడని తెలిపారు. డబ్బు గురించి హరినాథ్ రెడ్డి ముందుగానే తన స్నేహితులైన రమేష్, వినోద్లకు సమాచారం ఇవ్వగా వారు కూడా అదే బస్సులో ప్రయాణికులుగా వస్తున్నారని ఏఎస్పీ వెల్లడించారు. బస్సు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని రుద్రకోట దగ్గర ఓ దాబా వద్ద ఆగగా, రమేష్, వినోద్‌లు ఆ డబ్బు సంచులను తీసుకుని వెనుక వస్తున్న కారులో పరారయ్యారని తెలిపారు.