Police Produced the Cock in Court :కోడి పందేల్లో అరెస్ట్ అయిన ఓ కోడి పుంజు కోర్టు మెట్లు ఎక్కింది. కోడిపుంజు తప్పేం లేదని తేలడంతో దాన్ని వేలం వేయాలని న్యాయమూర్తి నిర్ణయించారు. వేలంలో ఓ వ్యక్తి స్వాధీనం చేసుకోగా, కోసి తినేస్తారేమోనని ఆ కోడి పుంజు ఆందోళనకు గురైంది. తాను జీవ హింస చేయనని, సన్మానించి పెంచుకుంటానని న్యాయమూర్తితో చెప్పడంతో ఆ కోడిపుంజు ఊపిరి పీల్చుకుంది. అసలు విషయంలోకి వెళితే,
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అజీజ్ నగర్ పోచయ్య తోట వెనుక కొందరు కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రైడ్ చేశారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, రూ.10,000 నగదు, ఒక కోడిపుంజు, 12 కోడి కత్తులు, 5 ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ స్వాధీనం చేసుకున్న కోడిని మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు. న్యాయ సలహాతో కోడి పుంజును రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.