Police on MP Avinash Reddy PA House : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి PA రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పులివెందుల పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. పులివెందుల అర్బన్ ఎస్ఐ జీవన రంగనాథ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లాయి. వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకున్న సమయంలో అతనితో రాఘవరెడ్డి ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై రాఘవరెడ్డిని ఆదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన ఇంటి లోపల సోదాలు చేసి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు. రాఘవరెడ్డి కుటుంబ సభ్యుల వెంట లాయర్ ఓబులరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రాఘవరెడ్డి ఇంటికి వచ్చిన వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించి వెనుదిరిగారు.
పరారీలో సోషల్ మీడియా సైకో వర్రా రవీందర్‌రెడ్డి - ముమ్మరంగా పోలీసుల గాలింపు
సోషల్ మీడియా సైకో : పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త, సోషల్ మీడియా సైకోగా పేరొందిన వర్రా రవీందర్‌రెడ్డి కోసం వైఎస్సార్ జిల్లా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతోంది. 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వర్రా రవీందర్ రెడ్డి ఆచూకీ కోసం యత్నిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనితతో పాటు షర్మిల, సునీత, విజయమ్మలపై గత ఐదేళ్లుగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న రవీందర్ రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అతనిపై చర్యలకు ఉపక్రమించింది. రెండు రోజుల కిందట అతన్ని అదుపులోకి తీసుకొని మరో కేసులో అప్పగించే క్రమంలో పోలీసుల నిర్లక్ష్యంతో అతను తప్పించుకుని పారిపోయాడు.