Lookout Notices for Perni Jayasudha :గోదాములో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో నమోదైన కేసులో మాజీమంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ జిల్లా కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 19వ తేదికి వాయిదా పడింది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో పౌరసరఫరాల శాఖకు చెందిన 185 టన్నుల చౌక బియ్యం మాయమైన వ్యవహారంలో ఈ నెల 10న గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాని మచిలీపట్నంలో ప్రత్యక్షం అవడం చర్చంశనీయంగా మారింది.
తనపై నమోదైన కేసులపై ఈనెల 13న జయసుధ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిని జిల్లా జడ్జి అరుణసారిక 9వ అదనపు కోర్టుకు బదిలీ చేశారు. సోమవారం కేసుకు సంబంధించి వాదనలు జరగాల్సి ఉండగా పోలీసుల నుంచి సీడీ ఫైల్ అందకపోవడంతో తొమ్మిదో అదనపు కోర్టు న్యాయాధికారి ఎస్.సుజాత గురువారానికి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రధాన ప్రత్యేక పీపీని నియమించాల్సి ఉందని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడగా, ఇప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఏపీపీనే కొనసాగించడం పట్ల న్యాయవాద వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం! - ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన ఘటనకు సంబంధించి గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మాసన్ తేజపై క్రిమినల్ కేసుల నమోదైనప్పటి నుంచి పేర్ని కుటుంబం కనిపించడం లేదు. బియ్యం మాయమైన కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు సోమవారం ఎస్పీ గంగాధరరావు తెలిపారు.