TDP Membership in venkatapuram : టీడీపీ సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఆన్‌లైన్‌లో డిజిటల్ విధానంలో దీనిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నేతలు, కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పాతవారు రెన్యువల్ చేసుకుంటుండగా కొత్తవారిని చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే దివంగత నేత, పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురం కొత్త చరిత్ర సృష్టించింది. వంద శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
వెంకటాపురం గ్రామం శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం నసనకోట పంచాయతీ 225 పోలింగ్ బూత్ పరిధిలో ఉంది. గ్రామ జాబితాలో మొత్తం 581 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 11 మంది మరణించారు. మిగిలిన 570 మందిలో అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వందశాతం టీడీపీ సభ్యత్వం తీసుకున్న మొదటి గ్రామంగా వెంకటాపురం నిలిచింది.
TDP Membership Registration 2024 : తెెలుగుదేశం పార్టీ అవిర్భావం తర్వాత ఉమ్మడి జిల్లాలో ఈ రికార్డు సాధించిన ఏకైక గ్రామంగా వెంకటాపురం నిలిచిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. సభ్యత్వ నమోదులో హిందూపురం పార్లమెంట్ ఏపీలోనే రెండోస్థానంలో ఉంది. లోక్సభ పరిధిలో కదిరి 69,000 సభ్యత్వాలతో తొలి స్థానంలో ఉంది. 67,000 సభ్యత్వాలతో రాప్తాడు రెండోస్థానంలో నిలిచింది. పార్లమెంట్ పరిధిలో మొత్తం 4,29,071 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇవ్వనున్నారు. వంద రూపాయలు చెల్లించినవారికి గతంలో ఉన్న రూ.2 లక్షల బీమాను రూ.5 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ రోజే అంత్యక్రియలకు రూ.10,000 ఇవ్వనున్నారు. పార్టీ శ్రేణుల కుటుంబాలకు విద్య, ఉపాధి, వైద్యం కోసం టీడీపీ సాయం అందించనుంది.
ఇంకెందుకు ఆలస్యం - టీడీపీ కుటుంబంలో చేరండి : లోకేశ్
రూ.100తో ఐదు లక్షల బీమా- ఘనంగా ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం