Orphans in Andhra pradesh : రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు లేని చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఈ దిశగా కసరత్తు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ మిషన్ వాత్సల్య పథకానికి ఎంపిక చేసేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ రాష్ట్ర వ్యాప్తంగా గతేడాదే అనాథ చిన్నారుల వివరాలను సేకరించింది.
ఆ నివేదిక ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ లేని పిల్లలు 9,008 మంది ఉన్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు. అనాథ పిల్లలకు పింఛన్లు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాబట్టి అనాథ పిల్లల వివరాలను జిల్లా కలెక్టర్ల ద్వారా మరోసారి తనిఖీ చేయించనున్నారు. దీంతో పాటు ఇంకా ఎవరైనా అర్హులుంటే వారి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు దృష్టి సారించారు. ఈ పథకం అమలు విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేపట్టారు.
"తల్లీ మన్నించు!" - అర్ధరాత్రి చలిలో రోడ్డు పక్కన వదిలేసిన కుటుంబ సభ్యులు
మిషన్ వాత్సల్య కింద కొందరికే సాయం : తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, తల్లీ లేదా తండ్రి ఎవరినో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. వీటితోపాటు ఇందులో 60 శాతం కేంద్రం వాటా కాగా, 40 శాతం రాష్ట్రం భరిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం కింద పది వేల మంది లబ్ధిదారులున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. అర్హులైన వారందరికీ 18 ఏళ్ల వయసు వచ్చే వరకు వారికి ఈ పథకం వర్తిస్తుంది. గతేడాది ఆరు నెలలకు సరిపడా రూ.24 కోట్ల బడ్జెట్ మాత్రమే కేంద్రం నుంచి విడుదలైంది. ఆ మేరకే లబ్ధిదారులకు అందించారు.
పైగా ఈ పథకం కింద అందిన సాయం నెలనెలా కాకుండా విడతలవారీగా మంజూరవుతుంది. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి. కరోనా సమయంలో రాష్ట్రంలో వేల మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారని గణాంకాలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ కేంద్రం మిషన్ వాత్సల్య పథకానికి వారందరినీ పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రాలవారీగా కొంతమేర కోటా కేటాయించి ఆ మేరకు పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత ఉన్నా చాలా మందికి సాయం అందని పరిస్థితి నెలకొంది. కనీస చేదోడు లేక వారందరూ అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా అనాథ చిన్నారులకు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఇవ్వాలని రాష్ట్రం నిర్ణయించడంతో ఇలాంటివారికి చేయూత లభించనుంది.