Mangalagiri Police Inquiry on TDP Office Attack Case :తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన వ్యక్తుల్లో గుంటూరు నుంచి వచ్చిన వారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నుంచి వచ్చిన వారికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆ పార్టీ సమన్వయకర్త దేవినేని అవినాష్ డబ్బులిచ్చారని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇంతవరకు జరిపిన దర్యాప్తులో పలువురు నిందితులు ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బుధవారం లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ఆధారాలను ముందుపెట్టి విచారించినా సహకరించలేదని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విచారణాధికారి, మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. ఘటన జరిగిన రోజు అంశాలకు విచారణలో చెబుతున్న వివరాలకు ఏమాత్రం పొంతన లేదని సీఐ వివరించారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌ను పోలీసులు పిలిచారు. గవాస్కర్ ఉదయం 11 గంటలకు వచ్చి గంటన్నర తరువాత వెళ్లిపోయారు.
సంబంధం లేని సమాధానాలు : లేళ్ల అప్పిరెడ్డి మాత్రం సాయంత్రం 4 గంటలకు విచారణ సమయం ముగుస్తుండగా 3:45 గంటలకు హాజరయ్యారు. గంటన్నరపాటు ఆయన్ను విచారించి 14 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సంబంధం లేని సమాధానాలిచ్చారని సీఐ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. దాడిలో పాల్గొన్న కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలకు డబ్బులిచ్చిన అంశంపై ప్రత్యేకంగా ప్రశ్నించినా సంతృప్తికర సమాధానం చెప్పలేదని సీఐ వెల్లడించారు.