Madanapalle Sub Collector Office Fire Accident : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో ప్రభుత్వం ముమ్మర విచారణ చేపట్టింది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ కేసును పర్యవేక్షించడం, డీజీపీ, సీఐడీ చీఫ్ స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించడంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి కీలక దస్త్రాలు కాలిపోతున్నా కలెక్టర్‌కు గానీ, ఎస్పీకి గానీ సమాచారం ఇవ్వకపోవడంపై ఆరా తీస్తున్నారు.
AP Govt on Madanapalle Fire Accident :పోలీసులు ఎస్పీకి సమాచారం ఇవ్వగా ఆయన కలెక్టర్‌కు ఫోన్‌లో విషయం చెప్పారు. హరిప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. హరిప్రసాద్ స్థానంలో కొత్త ఆర్డీవో ఛార్జ్ తీసుకోవడానికి కొన్ని గంటల ముందు దస్త్రాలు తగలబడిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ ఓ ఉద్యోగి కార్యాలయంలో రాత్రి పదిన్నర వరకు ఉండటం, అతను వెళ్లిపోయిన తర్వాతే కార్యాలయం తగలబడటం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఉన్న ఆర్డీవో హరిప్రసాద్ కన్నా ముందు, మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి శనివారం మదనపల్లెలోనే మకా వేశారు. ఆ తర్వాత రోజే సబ్‌కలెక్టరేట్‌లో మంటలు చెలరేగడం మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆయన ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తోనూ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యాలయంలో పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు చెందిన భూముల దస్త్రాలన్నీ ఉన్నాయి. దీంతో మురళిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.