Most Common Reasons for Divorce : భార్యభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు విడాకులకు దారితీస్తున్న ఘటనలు అనేకం. నా భార్య ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతోందని, అందువల్లే మా మధ్య గొడవలు అంటూ ఓ భర్త ఫిర్యాదు చేస్తారు. నా భర్త రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి గొడవ పడుతున్నాడు. ఇక నేను భరించలేను అంటూ ఓ భార్య ఆవేదనతో విడాకులకు దరఖాస్తులు చేస్తున్నారు.
ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల కుటుంబంతో హాయిగా ఆనందంగా ఉండాల్సిన బంధాన్ని కొందరు విడిచిపెడుతున్నారు. చాలా మంది దంపతుల్లో సర్దుకుపోయే గుణం మాయమవుతోంది. ఏళ్ల వివాహ బంధాలకు స్వస్తి పలికి పిల్లల బతుకులతో చెలగాటమాడుతున్నారు. అతి సున్నితమైన, చిన్న కారణాలతో తమ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలకు సైతం వారు పరిష్కరించుకోకుండా పోలీసు స్టేషన్ గడప తొక్కుతున్నారు. ఇటువంటి సమస్యలు, ఫిర్యాదుల్లో యువ జంటలు కూడా ఉంటున్నాయి.
గృహ హింస నివారణ విభాగానికి వస్తున్న కేసుల్లో ఎక్కువ వీటివల్లే :
- పిల్లల ఇష్టా ఇష్టాలు తెలుసుకోకుండా తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయడంతో వారు సర్దుకోలేక గొడవలు తయారవుతున్నాయి.
- ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని బంధాలు తెగిపోతున్నాయి
- అత్తా, మామ, తోటి కోడల్లు, బావలు, ఆడపడుచులు ఇలా పెద్ద కుటుంబం ఉన్నా కొందరు మహిళలు సుముఖత చూపడం లేదు.
దంపతులు విడిపోతున్న వారిలో సుమారుగా 90 శాతం కేసుల్లో వారి మధ్య మనస్పర్థలకు, గొడవలకు చరవాణులు, అహం, అపోహలు, అక్రమ సంబంధాలు, మద్యం అలవాటు కారణమని పోలీసులు చెబుతున్నారు.
1. అహం : ప్రతీ వాదనలో నా మాటే చెల్లుబాటు కావాలనుకునే మనస్తత్వం. నేను లేకపోతే ఇల్లు నడవదు, నేను పని చెయ్యకపోతే పూట గడవదు, నా జీతంపై ఆధారపడే అంతా బతుకుతున్నారు. నా కష్టంతోనే కుటుంబం నడుస్తోంది. ఇలా అనుకుని ఎవరికి వారు అహం ప్రదర్శిస్తున్నారు. సారీ చెబితే అయిపోయే విషయాలను కూడా అహం వల్ల పోలీసుల వరకు తీసుకొస్తున్న కేసులు అనేకం.
2. అపోహలు : అపోహలు అశాంతికి దారితీస్తున్నాయి. ఏదో ఊహించుకుని ఇంకేదో మనసులో పెట్టుకొని మాట్లాడడం చేయిచేసుకోవడం వంటి కారణాలతో గొడవలు వస్తున్నాయి. ఏదైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకోకుండా దెప్పిపొడవడం వల్ల గొడవలు జరుగుతున్నాయి.
3. చరవాణులు : భర్త ఎవరితోనే గంటల తరబడి మాట్లాడుతున్నాడని, భార్య ఫోన్‌లో తరచూ కొన్ని నంబర్లు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. వచ్చిన కేసుల్లో ఒక పాయింటు కచ్చితంగా ఫోన్ గురించి ఉంటోంది.
4. మద్యం : దంపతుల మధ్య విభేదాల్లో ఇది ఓ ప్రధాన కారణం. మద్యం మత్తులో భార్యను ఇష్టానుసారంగా మాట్లాడడం, కొట్టడం వల్ల గొడవలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో మద్యం రక్కసి ఎక్కువగా ప్రభావం చూపుతోంది.
5. వివాహేతర సంబంధాలు : భాగస్వామి వేరే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉండడం ఎవరూ తట్టుకోలేరు. ఏదో ఓ కారణంతో ఇతరులకు ఆకర్షితులవ్వడం వల్ల గొడవలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరో మనిషితో సంబంధం పెట్టుకోవడంతో 75 శాతం గొడవలు జరుగుతున్నాయి.
దంపతులకు నిత్యం కౌన్సెలింగ్ : ఈ తరహా కేసులు కాకినాడలోని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ పరిధిలోని గృహ హింస నివారణ విభాగానికి వస్తున్నాయి. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలు రావడంతోపాటు ఆ కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. పట్టుదలకు పోయి చిన్న సమస్యను పెద్దవి చేసుకుంటున్నారని, ఇతరుల అనవసర జోక్యంతో భార్యాభర్తలు విడిపోయే స్థాయికి చేరుకుంటున్నారని కౌన్సెలర్లు, సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.
భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సాధారణం. నేటి యువత వాటిని అధిగమించడంలో విఫలమవుతున్నారు. దీంతో కలహాలు ఏర్పడి విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. - డీఏఎస్ శ్రావ్య, డీవీసీ లీగల్ కౌన్సెలర్
పరిష్కారం దిశగా చర్యలు : చాలామంది వివాహం చేసుకున్న కొన్ని నెలలకే గొడవలు పడి విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. పిల్లలున్నా వారి భవిష్యత్తు కోసం ఆలోచించడం లేదు. వారి సమస్యలన్నీ సర్దుకుపోయేవే. ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంసారాలు చక్కబడతాయి.
(2007 నుంచి 2024 మే వరకు) ఉమ్మడి జిల్లాలో నమోదైన వివరాలు | |
మొత్తం కేసులు | 5392 |
కౌన్సెలింగ్‌లో రాజీ కుదిరినవి | 1039 |
ఉపసంహరించుకున్నవి | 2097 |
న్యాయస్థానాలకు వెళ్లినవి | 2230 |
మధ్యంతర ఉత్తర్వులు | 457 |
తుది తీర్పు ఇచ్చినవి | 910 |
పెండింగ్‌లో ఉన్నవి | 863 |