Sweet Potato Benefits in Telugu : మహా శివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగారం ప్రధానం. ఆ పరమశివుడిని ప్రార్థిస్తూ ఉపవాసం అనంతరం తీసుకునే ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి. ఎక్కువ మంది శివరాత్రి రోజు చిలగడ దుంప తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు కారణాల్లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాం.
దెనుసుగడ్డలూ, రత్నపురి గడ్డలూ ఇలా మన దగ్గర ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలిచే ఈ చిలగడ దుంపలు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి. ఈ స్వీట్ పొటాటోని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలును పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 5వేల సంవత్సరాల క్రితం నుంచీ పరిచయం ఉన్న ఈ చిలగడ దుంపల్ని- బడ్జెట్‌లో అందుబాటులో ఉండే సూపర్‌ఫుడ్ అని నిపుణులంటారు. దేశదేశాల్లో ప్రధానమైన పంటలుగా చెప్పే వరి, మొక్కజొన్న, గోధుమ, బంగాళాదుంపల వరసలో ఇదీ ఉండటం విశేషం!
శివరాత్రి రోజు ఎందుకు తింటారు?
మహా శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం (ఆహారం తినకుండా) ఉంటారు. సాయంత్రం ఉపవాసం విడిచే క్రమంలో ఉడికించిన చిలగడ దుంపను తింటారు. అయితే, వీటిని తినడం వల్ల కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ సమయం పాటు శక్తిని ఇస్తాయని అంటున్నారు. అలాగే శివరాత్రి రోజు ఎక్కువ మంది జాగరం (నిద్ర పోకుండా) ఉంటారు. చిలగడ దుంప తినడం వల్ల శరీరంపై నిద్రలేమి ప్రభావం తక్కువగా ఉంటుందట. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారని నిపుణులు పేర్కొన్నారు.
పోషకాలు అనేకం!
శరీర బరువును తగ్గించడంలో, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ కణాలతో పోరాడటంలోనూ చిలగడ దుంప సహాయం చేస్తుంది. అందుకే వీటిని బెస్ట్ రూట్ వెజిటబుల్‌గా చెబుతారు. దీని ద్వారా శరీరానికి ఎన్నో ఖనిజాలూ, విటమిన్లూ లభిస్తాయి. ముఖ్యంగా బీటా కెరొటిన్, విటమిన్ ఎ, సి, ఈ, బి-6, పొటాషియం, పీచు అధికంగా అందుతాయి.
డైలీ ఒక దుంప!
పసి పిల్లలకు పరిచయం చేసే మొదటి ఆహారంలో దీన్ని కచ్చితంగా ఉంచాల్సిందే. పిల్లలకు సీజనల్‌గా వచ్చే దగ్గూ, జలుబుల్లాంటి అనారోగ్య ఇబ్బందుల్ని దరిచేరనివ్వదు. డైలీ ఒక దుంప తినిపించడం వల్ల బుజ్జాయిల శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది.
చిలగడ దుంపతో కలిగే ప్రయోజనాలు!
- పొట్ట ఆరోగ్యానికి చిలగడ దుంపలోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంతోపాటు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
- ఈ దుంప కండరాల కదలికలకీ, ఎముకల బలానికీ సాయపడుతుందట.
- క్యాన్సర్లను తిప్పి కొట్టే యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో అధికం. ఊదా రంగులోని దుంపలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇది దీర్ఘకాలిక వ్యాధుల్ని అరికడుతుంది.
- స్వీట్ పొటాటోలోని విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరిలో రకరకాల కంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
- చిలగడ దుంపను తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అధికరక్తపోటును నియంత్రిస్తూ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
- గర్భిణులకు స్వీట్ పొటాటో చక్కటి పోషకాహారం. గర్భస్థ శిశువు ఎదుగుదలకి బాగా తోడ్పడుతుంది.
- బరువు తగ్గాలని ప్రయత్నించేవారు చిలగడ దుంపల్ని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. తక్కువ క్యాలరీలూ, ఎక్కువ పీచుతో ఉండే ఇది- చాలా సేపటి వరకూ పొట్ట నిండుగా ఉన్నట్లు అనుభూతిని కలిగిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాల్ని అందిస్తూ నీరసం రాకుండా ఉంచుతుంది.
- మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు కావాల్సిన విటమిన్ బి-6 చిలగడ దుంపలో అధికంగా ఉంటుంది. ఇంకా ఒత్తిడిని తగ్గించడానికీ, జ్ఞాపకశక్తిని పెంచడానికీ ఇది ఉపయోగమే!
- జుట్టుకీ, చర్మానికీ స్వీట్ పొటాటో ఎంతో మంచిది. దీంట్లో అత్యధికంగా ఉండే విటమిన్ సి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతంది. కొలాజెన్ ఉత్పత్తికీ, మృతకణాల్ని తొలగించడానికీ తోడ్పడుతుంది. ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ ఎ జుట్టుకు దృఢత్వాన్ని ఇస్తూ చుండ్రు సమస్యల్ని తగ్గిస్తుంది.
NOTE : చిలగడ దుంప ఆరోగ్య ప్రయోజనాలపై ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నిల్వ పచ్చళ్లను గాజు జాడీల్లోనే ఎందుకు స్టోర్ చేస్తారు? - మీకు తెలుసా?
'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు