Vijayawada Durga Temple 100 years Development Plan : ఏటా రెండు కోట్ల మంది భక్తులు, రూ.120 కోట్ల ఆదాయం. ఇది విజయవాడ దుర్గగుడికి ఉన్న విశిష్టత. కానీ భక్తుల సౌకర్యాల కల్పన విషయంలో మాత్రం శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన అభివృద్ధి పనులు ఒక్కటీ లేవు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ భక్తులకు సరైన కాటేజీలు కూడా లేవు. భక్తుల వాహనాలకు పార్కింగ్ ప్రాంతం, అన్నదానం, ప్రసాదాల తయారీకి భవనాలు లేవు. అన్నీ కూడా తాత్కాలికంగా డబ్బులు కరిగించడమే లక్ష్యంగా చేస్తున్న పనులే జరుగుతాయి. ఇక ఆలయానికి ఈవో మారగానే కట్టిన భవనాలన్నీ నేలకూల్చి మళ్లీ కడుతుంటారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయంగా పేరొందినప్పటికీ కనీసం ఓ బృహత్తర ప్రణాళికను కూడా ఇన్నేళ్లలో సరిగా రూపొందించింది లేదు. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
రూ.100 కోట్లతో శాశ్వత అభివృద్ధి : విజయవాడ దుర్గగుడి అభివృద్ధిపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే వందేళ్ల అవసరాలకు తగ్గట్లు రూ.100 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఒక బృహత్తర ప్రణాళికలను రూపొందిస్తామంటూ ప్రకటన చేయటం శుభ పరిణామం. దుర్గగుడితో పాటు పర్యాటక శాఖను సమన్వయం చేస్తామని సమావేశంలో నిర్ణయించారు. అలాగే అభివృద్ధి విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలన్నారు.
అమ్మవారి చీరల కుంభకోణం - 33వేల చీరలు మాయమైనా చర్యలు శూన్యం
భక్తులకు ఏ ప్రయోజనం లేదు : కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కొంతమంది అధికారులు, గుత్తేదారుల జేబులు నింపే ఏటువంటి పనులకు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎలివేటెడ్ క్యూలైన్ పనులతో చాలా నిధులు వృథాగా ఖర్చవుతున్నాయని గుర్తించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎంతో కష్టపడి కనకదుర్గానగర్‌లో రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం దానిని సగం వరకూ ఆక్రమించేలా ఈ క్యూలైన్లను నిర్మిస్తున్నారు. దీంతో రాజమార్గం ఇరుకు సందులా మారిపోతోంది. పోనీ భక్తులకు ఏమైనా ప్రయోజనం చేకురుతుందా? అంటే ఏమిలేదు. ఇలాంటి వాటిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
ప్రసాద్ పథకం ద్వారా నిధులు : ఆలయ అభివృద్ధిపై మంత్రి ఆనం ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఈవో రామారావు, కమిషనర్ సత్యనారాయణ తదితరులతో సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ చిన్ని అధికారులకు పలు సూచనలు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రసాద్ పథకం ద్వారా నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
సీఎం సూచనలు, సలహాలతో : అలాగే టీటీడీ తరహాలో భక్తులకు కోసం విశ్రాంతి గదులు, కాటేజీలు లాంటివి నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. దేవాలయం అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ప్రణాళికలు చూపించి ఆయన సలహాలు, సూచనల అనంతరం చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం, ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గతంలో తయారుచేసిన బృహత్తర ప్రణాళిక సమగ్రంగా లేదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ పథకం నిధులు తీసుకొచ్చి దుర్గమ్మ ఆలయానికి అవసరమైన కాటేజీలు, ప్రసాదాల పోటు, అన్నప్రసాద కేంద్రం, కేశఖండన శాల, శాశ్వతంగా ఉండిపోయేలా నిర్మిస్తామన్నారు.
ఇంద్రకీలాద్రి పేరెలా వచ్చింది? విజయవాడ కనకదుర్గ ఆలయ చరిత్ర మీకోసం! - Dussehra 2024