Polavaram Project Files Burnt :అధికారం కోల్పోగానే కీలకమైన దస్త్రాలను మంటలపాలు కావడం రివాజుగా మారింది. మొన్నటికి మొన్న మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలు దహనం అయిపోయాయి. భూ అక్రమాలకు ఆధారాల్లేకుండా నిజాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రాలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు ఏదైనా కిరికిరి ఉంటే తప్ప దస్త్రాలు కాల్చేయడానికి పెద్ద కారణాలు ఉండవు. ఈ పోలవరం ఫైల్స్‌లోనూ అదే స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలు ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో దస్త్రాలు తగలబెట్టారని జోరుగా ప్రచారం సాగుతోంది.
భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధం? :ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో (POLAVARAM PROJECT AUTHORITY OFFICE) దస్త్రాలు దగ్ధం కావడం చర్చనీయాంశమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే కార్యాలయంలోని అధికారులే దస్త్రాలు కాల్చేశారని అనుమానం కలుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి దస్త్రాలు తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
మదనపల్లె అగ్నిప్రమాదం కేసు - ఎంఆర్‌ఐ డేటాలో వెలుగులోకి కీలక విషయాలు - Madanapalle Fire Accident Case
ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? :కాల్చివేసిన దస్త్రాలను ఇన్‌ఛార్జ్ సబ్ కలెక్టర్ శివ జ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. సగం కాలిపోయిన దస్త్రాలను స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారం సంబంధించిన దస్రాలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే శుక్రవారం రాత్రి కార్యాలయం సిబ్బంది దస్త్రాలు తగులబెట్టేశారని తెలుస్తోంది. ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? అనే అంశాలపై అధికారుల బృందం ఆరా తీస్తోంది.