Python Halchal in Wedding Ceremony : ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరుగుతోంది. భాజా భజంత్రీలు, బంధుమిత్రుల రాకతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. అంతా పెళ్లి బిజీలో ఉన్నారు. మరి కాసేపట్లో పెండ్లి తంతు జరగనుంది. అంతలోనే ఆ వివాహ వేదిక వద్దకు ఓ అనుకోని అతిథి వచ్చింది. దానిని చూసిన అక్కడి వారంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అదేంటి ఎవరైనా అతిథులు వస్తే ఆహ్వానించాలి కానీ ఇలా ఎవరైనా చేస్తారా అని సందేహం కలగకమానదు.
ఆ వివాహ వేడుకకు వచ్చింది ఓ కొండచిలువ. దానిని చూసి వారంతా భయంతో పరుగు తీశారు. వివరాలివీ.. కొవ్వూరు కాశీవిశ్వేశ్వరస్వామి పంచాయతన శివాలయం మండపంలో బుధవారం రాత్రి ఓ కొండ చిలువ హల్‌చల్ చేసింది. గోదావరి గట్టుపై సుబ్రహ్మణ్యేశ్వర స్నానఘాట్‌లోని పైఅంతస్తులో శివాలయం, కింది భాగంలో కల్యాణ మండపం, వేదిక ఉన్నాయి.
పరుగులు తీసిన బంధువులు : రాత్రి వేళ ఇక్కడి మండపంలో వివాహ ఏర్పాట్లు చేశారు. ఇది జరుగుతుండగా గోడ పక్కగా ఏదో మెరుస్తూ కదులుతున్నట్లు ఒకరు చూశారు. తీరా చూస్తే సుమారు 7 అడుగుల పొడవున్న కొండచిలువ అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అతను పాము.. పాము అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పెళ్లి మండపంలో అందరూ పరుగులు తీశారు. స్థానికులు పట్టణ సీఐ పి.విశ్వానికి సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బందితో ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
అందరూ వచ్చి మూగడంతో కొండచిలువ చాలాసేపు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు గంట తర్వాత అది గేటు పక్క నుంచి గోదావరి వైపు వెళ్లిపోయింది. దీంతో పెళ్లి వారు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మండపంలో ఓ వైపు చివరికి చేరి వివాహ తంతును పూర్తి చేశారు. ఇంతలో అటవీశాఖ అధికారులు వచ్చి దానిని పట్టుకుని తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.