Investigation on CID former officer Vijay Pal : 'తెలియదు, గుర్తులేదు, మరిచిపోయా, నాకేం సంబంధం లేదు' అంటూ సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్ పోలీసు విచారణలో డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తప్పించుకునే ధోరణిలోనే జవాబులు ఇచ్చారు. విచారణకు ఏ మాత్రమూ సహకరించలేదు. అయినా పోలీసులు ఆయన నుంచి కొంత కీలక సమాచారం రాబట్టగలిగారు.
Raghurama Custodial Torture Case : ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, అప్పటి నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును 2021 మే నెలలో కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి, హత్యకు యత్నించారనే ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో జులైలో నమోదైన కేసులో విజయ్‌పాల్ బుధవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తు అధికారిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని విచారణ బృందం విజయ్‌పాల్‌ను ఉదయం 11 నుంచి సాయంత్రం 5.45 మధ్య దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. 45కు పైగా ప్రశ్నలు సంధించింది. వాటిలో ఏ ఒక్కదానికీ విజయ్‌పాల్ సూటిగా సమాధానం చెప్పలేదు. తానేం తప్పు చేయలేదు అంటూ బుకాయించారు.
రఘురామకృష్ణరాజు గాయాలు ఎలా అయ్యాయి? : 'రఘురామకృష్ణరాజును కస్టడీలో ఉన్నప్పుడు ఎందుకు కొట్టారు? ఆయన్ను చిత్రహింసలకు గురిచేయాలని మిమ్మల్లి ఆదేశించిందెవరు?' అని ప్రశ్నించగా తానేం కొట్టలేదంటూ విజయ్‌పాల్ చెప్పినట్లు సమాచారం. 'రఘురామకృష్ణరాజు అరికాళ్లపై తీవ్ర గాయాలు అయినట్లు మిలటరీ ఆసుపత్రి నివేదికలో స్పష్టంగా ఉంది. కొట్టకపోతే ఆ గాయాలు ఎలా అయ్యాయని అడగ్గా తనకేం తెలియదంటూ దాటవేత ధోరణితో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
ముందే ప్రణాళిక రూపొందించుకున్నారా? : 'హైదరాబాద్‌లో రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తీసుకు వచ్చిన తర్వాత నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచకుండా సీఐడీ (CID) కార్యాలయంలో రాత్రంతా ఎందుకు నిర్బంధించారు? ఆ రాత్రి సీఐడీ కార్యాలయంలోకి ఎవరెవరు వచ్చారు?' అని ప్రశ్నించగా అప్పుడు ఏం జరిగిందో తనకు గుర్తు లేదంటూ విజయ్‌పాల్ సమాధానం ఇమిచ్చినట్లు సమాచారం. కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టగా నీళ్లు నమిలారు.
'రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఆయన్ను కస్టడీలోకి తీసుకుని కొట్టాలని ముందే ప్రణాళిక రూపొందించుకున్నారా? అలా చేయాలని మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు?' అని ప్రశ్నించగా విజయ్‌పాల్ మౌనం వహించినట్లు తెలిసింది. పదే పదే ఈ ప్రశ్నలు అడిగినా ఆయన స్పందించలేదని సమాచారం.
నేను కొట్టలేదు : 'రఘురామను కస్టడీలో కొట్టడం వల్ల మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది? అది ఎవరి నుంచి సమకూరింది?' అని విజయ్‌పాల్‌ను ప్రశ్నించగా తాను కొట్టలేదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. రఘురామను కస్టడీలోనే అంతమొందించేందుకు ముందస్తు కుట్ర ఏమైనా జరిగిందా? జరిగితే అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో వివరాలు రాబట్టేందుకు విచారణ అధికారులు యత్నించారు. విజయ్‌పాల్ విచారణకు సహకరించకపోవటంతో ఆయన్ను మరోసారి విచారణకు పిలిపించనున్నట్లు సమాచారం. ఈ కేసులో అక్టోబరు 11న గుంటూరులో విచారణకు హాజరైన విజయపాల్ అప్పుడు కూడా ఇలాగే డొంకతిరుగుడు సమాధానాలిచ్చిన సంగతి తెలిసిందే.