Police Interrogated to Pulivarthi Nani :తిరుపతి ఎస్వీ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు. నానిని ఎస్‌వీయూ క్యాంపస్‌లోని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ మురళీ మోహన్ వివరాలు సేకరించారు. అనంతరం పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ, పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డేనని తెలిపారు. ఈ కేసులో నిందితులను వదిలేసి అమాయకులను ఇరికించారని డీఎస్పీకి తెలిపినట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో నలుగురు అమాయకులేనని వివరించారు. ఆ దాడిలో భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు, భానుకుమార్ రెడ్డి నన్ను చంపాడానికి చూశారని గుర్తు చేశారు. ఈ కేసులో అసలు పాత్రధారులు, సూత్రధారులను పోలీసులు వదిలేశారని విమర్శించారు. ఆ ఘటనలో 70 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.
రిపోలింగ్ చేస్తే మాకే పోలింగ్ శాతం పెరుగుతుంది : నాపై హత్యాయత్నం చేస్తే వైఎస్సార్సీపీ కార్యకర్తలను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు, నా కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాలని కోరారు. అలాగే కౌంటింగ్ సరిగా నిర్వహించేలా అధికారులు చూడాలన్నారు. కుట్రలో భాగంగానే చెవిరెడ్డి ఇలాంటి దాడులకు తెగపడ్డారని వెల్లడించారు. అనుచరులు చేజారకుండా కావాలనే ఆయన మనుషులపై కేసులు పెట్టించారని తెలిపారు. పోలీసులకు ఇవ్వాల్సిన ఆధారాలను ఇచ్చాను. అమాయకులను కేసులో ఇరికించారు. చంద్రగిరి ప్రశాంతంగా చూడటమే నా లక్ష్యమన్నారు. రీపోలింగ్ చేస్తే మాకే పోలింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. ఎక్కడ గొడవలు జరగలేదు. కావాలని చెవిరెడ్డి రీపోలింగ్ అడిగినట్లు ఉన్నారని పులివర్తి నాని విమర్శించారు.