Drugs Caught in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. లంగర్‌హౌస్, హుమాయున్‌నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌తో కలిసి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
డ్రగ్ పెడ్లర్లు వచ్చినట్లు సమాచారం : టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధింద్ర తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేయడానికి డ్రగ్ పెడ్లర్లు వచ్చినట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో లంగర్ హౌస్ పోలీస్, నార్కోటిక్ పోలీసుల ద్వారా జాయింట్ ఆపరేషన్ చేశామన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒలివర్ ఉగచుక్వో అలియాస్ జాన్సన్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ఆఫ్రికా దేశానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
1300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ : జాన్సన్ దిల్లీ నుంచి బెంగళూరుకు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నైజిరియన్స్తో పరిచయం చేసుకొని హైదరాబాద్, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. 1300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడు ఒలివర్ అలియాస్ జాన్సన్‌ను కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. మరో కేసులో పాత నేరస్తుడు గన్యా దేశస్తుడైన మౌస కామ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మాదకద్రవ్యాల కేసులో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు తెలిపారు.