Money Hunting in YouTube :సామాజిక మాధ్యమాల మోజులో, రీల్స్ పిచ్చిలో పడి యువత చేస్తున్న ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. లైక్స్, వ్యూస్ కోసం వినూత్నంగా చేయాలని, ట్రెండింగ్‌లోకి రావాలని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ట్రెండ్ అవ్వాలనే ఆలోచనతో వారు చేసే పనులు చిక్కుల్లోకి నెట్టెస్తున్నాయి. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా మనీ హంట్ పేరిట వీడియోలు చేసి పలువురు కేసుల్లో బుక్ అవుతున్నారు.
ఏంటీ ఈ మనీ హంట్ :ఈ వీడియోలో వాళ్లు ఏం చేస్తారు అంటే. కొంత డబ్బు తీసుకుని ఎవరికైనా డబ్బులు అవసరమా, డబ్బులు కావాలా అంటూ స్టార్ట్ చేస్తారు. అలా ఒక ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్లేస్ వివరాలన్నీ చెప్తారు. ఎక్కడకు వచ్చారు.. ఆ ప్లేస్‌కి ఎలా చేరుకోవాలి. ల్యాండ్ మార్క్స్‌తో సహా చెబుతారు. ఇలా చెప్పి వాళ్లు తీసుకొచ్చిన కొంత డబ్బులు ఒక చోట దాచిపెడతారు. అలా దాచిపెట్టి తీసుకోండి ఇక్కడికి వచ్చి అంటూ వదిలేసి వెళ్లిపోతారు. వాళ్లను ఫాలో అయినా వారో లేక వీడియో చూసిన వారో అక్కడికి వెళ్లి వాటిని తీసుకోడాని ప్రయత్నిస్తారు ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయి.
యూట్యూబర్‌పై కేసు నమోదు :తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన డబ్బులు పడేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టిన ఓ యూట్యూబర్‌పై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ చెందిన భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్ చేశాడు. ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకోండి అంటూ చెప్పాడు. ఈ వీడియో చూసిన పోలీసులు డబ్బులు కోసం ప్రజలు ఓఆర్ఆర్ పైకి భారీగా వచ్చే అవకాశముందని, ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉందని కేసు నమోదు చేశారు.