Secunderabad Gold Theft Case :ఈనెల 18న సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఓ జ్యూవెలరీ షాపులో పనిచేస్తున్న దినేష్ కుమార్ లోహర్ అనే వ్యక్తి మోండా మార్కెట్ నుంచి కార్ఖానాకు బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్నాడు. క్లాక్ టవర్ వద్దకు రాగానే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అడ్డగించి రూ. 60 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని వెళ్లిపోయారు. విషయాన్ని దినేష్ యజమానికి చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి మార్కెట్ పీఎస్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించి పోలీసులు 40 గంటల్లోనే ఛేదించారు. మార్కెట్ ఠాణా ఎస్ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి సుమారు 100కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నేరగాళ్లను పట్టుకున్నారు.
కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్ ఓల్డ్ జైల్ ఖానాలో ప్రఫుల్ జైన్ అనే వ్యాపారి ఎస్ఎస్ జ్యూవెలరీ షాపు సహా కార్ఖానా నడుపుతున్నాడు. బంగారు ఆభరణాలు విక్రయించడం సహా పలు దుకాణాల ఆర్డర్లు తీసుకుని చేయిస్తుంటాడు. రెండు నెలల క్రితం రాజస్థాన్‌కు చెందిన దినేష్ కుమార్ లోహర్ అనే 19 ఏళ్ల యువకుడు పనిలో చేరాడు. అల్వాల్‌లో నివాసం ఉంటూ ప్రతి రోజు ఓల్డ్ జైల్ ఖానాలోని షాపుకి పనికి వెళ్తుంటాడు. అయితే అదే ప్రాంతంలో నివాసం ఉండే మహేందర్ కుమార్‌తో దినేష్‌కు పరిచయం ఏర్పడింది. మహేందర్ నగరంలోని పలు జ్యూవెలరీ షాపులో పనిచేసే వారిని రాజస్థాన్ నుంచి సమకూరుస్తుంటాడు.
బంగారం షాపులో పనిచేస్తే ఏమి రాదని అవకాశం ఉంటే చెప్పు దొచేద్దామని మహేందర్ దినేష్‌ను రెచ్చగొట్టాడు. ఇందుకు సరేనన్న దినేష్ సమయం కోసం ఎదురు చూశాడు. నమ్మకంగా పనిచేస్తుండటంతో శ్రీశ్రీ జువెల్లరీ షాపులో ఇచ్చిన 850 గ్రాముల 26నక్లెస్‌లు తీసుకొచ్చే పనిని యజమాని దినేష్‌కు అప్పజెప్పాడు. ఈ విషయాన్ని మహేందర్‌కి చెప్పగా అతను పథకం వేశాడు. దారి దోపిడీగా చిత్రీకరించి పరారైతే ఎవరికీ అనుమానం రాదని భావించారు. దోపిడీ నాటకం కోసం స్నేహితులైన భవాని, గిరి, ప్రవీణ్ కుమార్ మాలి, ఉమేష్‌లను సిద్ధం చేశాడు.