Police File Murder Attempt Case Against Perni Kittu:కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్లో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి కిట్టు అనుచరులు దాడి చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు. చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్‌పై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. పేర్ని కిట్టు మినహా మిగిలిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జనసేన నేత కర్రి మహేశ్ పై కూడా కేసు నమోదు చేశారు. కర్రి మహేశ్‌తో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన దళిత మహిళ నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు.
పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు - జనసేన నేత ఇంటిపై దాడి - Perni Kittu Follower Attack
బందరులో వైసీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తున్నారు. గురువారం బందరు 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆడంబరంగా ప్రచారం నిర్వహించారు. అదే కాలనీలో జనసేన కార్యకర్త కర్రి మహేష్ నివాసం ఉంటున్నారు. స్వర్ణకారుడైన ఆయన గత కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓడిపోయారు. పేర్ని కిట్టు ప్రచార వాహనం మహేష్ నివాసానికి చేరుకోగానే పెద్దఎత్తున బాణసంచా కాల్చగా, నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకెళ్లాయి. దీంతో అక్కడున్న మహిళలు బాణసంచా ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పేర్ని కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడి చేశారు.