Police Custody Petition in Perni Nani Ration Rice Case:మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్టు చేసిన నలుగురు నిందితులను 5 రోజులు కస్టడీకి కావాలంటూ మచిలీపట్నం జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్పై విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం జిల్లా జైలులో ఏ2 మానస్ తేజ్, ఏ3 కోటిరెడ్డి, ఏ4 మంగారావు, ఏ5 బాలాంజనేయులు రిమాండ్లో ఉన్నారు. నిందితులను న్యాయస్థానం కస్టడీకి అనుమతి ఇస్తే కేసులో దర్యాప్తు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
విచారణకు హాజరైన పేర్ని జయసుధ:కాగా ఈ కేసులో ఇప్పటికే పేర్ని జయసుధ బందరు తాలుకా పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సీఐ ఏసుబాబు పేర్ని జయసుధను విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని వెల్లడించారు. ఈ రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ ఏ1గా ఉన్నారు. ఇప్పటికే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.
ప్రభుత్వ వాహనంలో విచారణకు: పేర్ని జయసుధ విచారణకు మేయర్ కారులో రావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే విచారణ సందర్బంగా పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఎంతసేపు విచారిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు పంపించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారని ఆమె లాయర్లు ప్రశ్నించారు.