Police Arrested Man Who Cheated Woman in Matrimony :షాది.కామ్ మ్యాట్రిమోనిలో మహిళను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బు కాజేసిన సైబర్ నేరస్థుడు శ్రీబాల వంశీకృష్ణను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ మదీనాగూడకు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షాదీ.కామ్ మ్యాట్రీమోనీలో మహిళతో పరిచయం పెంచుకుని, తను గ్లెన్‌మార్క్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు, సదరు మహిళను అమెరికా తీసుకెళ్తానని మోసపు వాగ్దానాలు చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
Man arrest for cheating Woman : అందుకు తన సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని, పెంచేందుకు తన కంపెనీ నుంచి రుణాలు ఇస్తానని నమ్మబలికి, ఆమెకు సంబంధించిన బ్యాంకు వివరాలు తీసుకుని 2.71 కోట్ల రూపాయలు కాజేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై గతంలో 9 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి పలు బ్యాంకులకు చెందిన 6 పాస్ బుక్‌లు, 10 డెబిట్ కార్డులు, మూడు ఫోన్లు, 4 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లో అపరిచితులకు డబ్బు పంపకూడదని, సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
RTC Md Sajjanar on Cybercrime Criminals :ఇదికాగా మరోవైపు నకిలీ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు. పార్సిళ్లలో డ్రగ్స్, తీవ్రవాదులతో బ్యాంక్ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారన్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్ ఇస్తూ, తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్(FIR)కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని ట్వీట్ చేశారు.