Four Thief Broke into House and Robbed Gold in Ghatkesar :నలుగురు స్నేహితులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే తమ లక్ష్యంగా చేసుకున్నారు. అంతకముందే పోలీసులు పలు చోరీల కేసుల్లో ఆ నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. తాజాగా మరోసారి కూడా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఘట్‌కేసర్ సీఐ సైదులు, డీఐ అశోక్‌తేజ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1న ఉదయం యంనంపేట చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ ఆటోలో వచ్చిన మల్లాపూర్‌లో నివాసముంటున్న బొందల మల్లేశ్(40) భూపని ఆకాశ్(27) మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన షేక్‌అల్తాఫ్(23) మల్కాజిగిరి వినాయకనగర్‌కు చెందిన వెంకటప్రసాద్(35)లను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో విచారణ చేపట్టగా గత నెల 7న ఘట్‌కేసర్ కౌలస్య వెంచర్ కాలనీలో ఇంటితాళం పగలుగొట్టి 41 గ్రాముల బంగారు, 40 తులాలు వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. వీరిపై నాచారం, కీసర, కుషాయిగూడ, మేడిపల్లి ఠాణాల్లో 16 చోరీ కేసులున్నాయి.
ఎలా దొరికారంటే : ఈ నలుగురు నిందితులు రోజూ ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. ఇద్దరు తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళుతారు. మరో ఇద్దరు ఎవరైనా వస్తున్నారేమోనని కాపలాగా ఉంటారు. ఈ విధంగానే ఘట్‌కేసర్‌లో కూడా చోరీ చేశారు. అయితే ఆ ప్రాంతంలో చోరీ వేళ విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. దీంతో పోలీసులకు ఆధారాలు దొరకలేదు.