Police Arrested Accused in Robbery on National Highway in Vizianagaram:విజయనగరం జిల్లాలో గతేడాది మే 30న పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై జరిగిన దారి దోపిడీ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17.35 లక్షల నగదు, 5 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గతేడాది మే 30న పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగిందన్నారు.
ఈ దోపిడీలో విశాఖ నుంచి ఒడిశాలోని పర్లాకిమిడికి కారులో నగదు తీసుకెళ్తున్న వంశీకృష్ణ దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు దోపిడీకి గురైందని ఎస్పీ తెలిపారు. పథకం ప్రకారం దోపిడీదారులు ద్విచక్ర వాహనాలతో కారుని అడ్డగించి కారులోని వంశీకృష్ణ కళ్లలో కారం కొట్టి అతని వద్ద నుంచి 50 లక్షల నగదు దోచుకుపోయారని వెల్లడించారు. అప్పట్లో ఈ దోపిడీలో పాల్గొన్నవారిలో ఆరుగురు నిందితులతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రస్తుతం దారి దోపిడీలో పాల్గొన్న ప్రధాన నిందితులు రుద్రపంక్తి మధు, దారపు గోపాలకృష్ణను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 17.35 లక్షల నగదు, 5 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలియచేశారు.