ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేతలకు బెయిలు, కార్యకర్తలకు జైలు- రాజకీయ సంగ్రామంలో సామాన్యులే సమిధలు - no bail - NO BAIL

Police Arrest Cases Against YSRCP Followers : సార్వత్రిక ఎన్నికల సందర్భంలో వైఎస్సార్సీపీ నాయకులు చేసిన హింసాకాండ అంతా ఇంతా కాదు. టీడీపీ నాయకులపై బెదిరింపులు, దాడులు చేశారు. ఈ క్రమంలోనే నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బు, పలుకుబడి, అధికారంతో నాయకులు కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. కనీసం బెయిల్ పిటిషన్లు కూడా వేసుకోలేక సామాన్య కార్యకర్తలు చెరసాలల్లో మగ్గుతున్నారు.

pollice_booked_cases
pollice_booked_cases (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 9:34 AM IST

Police Arrest Cases Against YSRCP Followers :రాష్ట్రంలో మే 13న జరిగిన పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన వరుస అల్లర్లలో ఎందరో సామాన్యులు బలయ్యారు. రాజకీయ పార్టీల్లో ఉన్న తమ నాయకుడి కోసమో, పార్టీపై అభిమానంతోనే వారి అనుచరులు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీలు నేతలపై, అనుచరులపై దాడులు, విధ్వంసాలకు దిగారు. ఫలితంగా తీవ్రమైన అభియోగాలతో నమోదైన కేసుల్లో వారంతా ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నారు. ఆయా ఘటనల్లో అనుచరులను, కార్యకర్తలను పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రభావితం చేసిన నేతలు మాత్రం న్యాయస్థానాలను ఆశ్రయించి ఖరీదైన లాయర్లతో వాదనలు వినిపించి దర్జాగా బయట తిరుగుతున్నారు. డబ్బు, పలుకుబడి, అధికారంతో నేతలు ఉపశమనం పొందుతుంటే అవేవీ లేక కేసుల్లో ఇరుక్కొని సామాన్యులైన కార్యకర్తలు, అనుచరులు తమ జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు.

ఒడిశాలోని చిలకా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగ్‌దేవ్‌ ఈ నెల 25న (మే 25న) జరిగిన ఎన్నికల్లో ఖుర్దా జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం(EVM) ను ధ్వంసం చేశారు. అక్కడి సిబ్బందితో దుర్భాషలాడారు. పోలింగ్​ కేంద్రంలోని సీసీ ఫుటేజీలు ఉన్నప్పటికీ అవి పరిశీలించాల్సిన అవసరం లేకుండానే ఈ ఘటనపై సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు అర్ధరాత్రి జగదేవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.

పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ - తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు - Pinnelli Ramakrishna Reddy Bail

రాష్ట్రంలో ఈనెల 13న పోలింగ్‌ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ధ్వంసం చేసిన దృశ్యాలను లోకమంతా చూసింది. ఆ విధ్వంసకాండ మొత్తం వెబ్‌ కెమెరాల్లోనూ రికార్డైంది. సాంకేతికంగా పక్కాగా ఆధారాలున్నా ఘటన జరిగిన వారం రోజుల వరకూ ఆయన పేరే నిందితుల జాబితాలో చేర్చలేదు. ఆ తర్వాత కూడా వెంటనే అరెస్టు చేయలేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లేందుకు, పరారైపోయేందుకు కావాల్సినంత సమయం ఇచ్చారు. ఈలోగా ఆయన హైకోర్టును ఆశ్రయించి జూన్‌ 6వ తేదీ వరకూ అరెస్టు కాకుండా రక్షణ పొందారు.

'ఓట్ల లెక్కింపు రోజున తీవ్ర అల్లర్లకు కుట్ర- పిన్నెల్లి బెయిల్​కు అనర్హుడు' - MLA Pinnelli Case

నేతలకు బెయిలు, కార్యకర్తలకు జైలు- రాజకీయ సంగ్రామంలో సామాన్యులే సమిధలు (ETV Bharat)

ముఖ్యమంత్రి జగన్‌పైకి గులకరాయి విసిరిన ఘటనలో నిందితుడైన సతీష్‌కుమార్‌ అలియాస్‌ సత్తిని విజయవాడ పోలీసులు ఏప్రిల్‌ 18న అరెస్టు చేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు నెలన్నర రోజులవుతున్నా సతీష్‌కుమార్‌కు బెయిల్‌ రాలేదు. ప్రస్తుతం ఆయన జైల్లోనే గడుపుతున్నారు. మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు, దాడులు, హత్యాయత్నం ఘటనల్లో వీరిరువురూ నిందితులుగా ఉన్నారు.

మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచి హత్యాయత్నానికి తెగబడ్డారని పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన నంబూరి శేషగిరిరావుపై అధికార ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయనపై హత్యాయత్నం చేశారంటూ మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పిన్నెల్లి సోదరులను పోలీసులు ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

తాడిపత్రి అల్లర్లపై పొంతన లేని జవాబులు - అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీపై వేటు

గతేడాది ఆగస్టులో పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో వందల మందిపై హత్యాయత్నం సెక్షన్లు కింద కేసులు పెట్టి 300 మందిని అరెస్టు చేశారు. వారంతా దాదాపు 45 రోజుల పాటు జైల్లోనే గడిపారు. అంతకు ముందు అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో కూడా హత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు పెట్టి దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా 45 రోజులపైనే జైల్లో ఉన్నారు. సామాన్య కార్యకర్తలు ఎలా బలైపోతున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

రాజ్యాంగం ప్రకారం ఎవరు నేరానికి పాల్పడినా సరే ఆ నేర తీవ్రతను బట్టే వారిపైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో మాత్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు తమ హోదా, పలుకుబడి, అధికారం, స్థాయి, డబ్బును అడ్డం పెట్టుకుని ఆయా కేసుల్లో ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారు హత్య, హత్యాయత్నం వంటి తీవ్ర కేసుల్లో నిందితులుగా ఉన్నా సరే పోలీసులు అసలు వారిని అరెస్టే చేయకుండా ఉండటంతో పాటు వారు పరారయ్యేందుకు, అజ్ఞాతంలో గడిపేందుకు కావాల్సినంత సమయమిస్తున్నారు. ఈ లోగా వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అత్యంత ఖరీదైన న్యాయవాదులతో వాదనలు వినిపించి ముందస్తు బెయిల్‌ లేదా తాత్కాలిక ఉపశమనం వంటివి పొందుతున్నారు. అవే కేసుల్లో నిందితులుగా ఉన్న ఆయా నాయకుల అనుచరులు, కార్యకర్తలు మాత్రం హైకోర్టును ఆశ్రయించ లేక, ఖరీదైన న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేక అరెస్టై రోజుల తరబడి స్థానిక జైళ్లల్లోనే గడుపుతున్నారు. కనీసం బెయిల్‌ పిటిషన్లు కూడా వేసుకోలేకపోతున్నారు.

మాచర్లలో పిన్నెల్లి అరాచకాలెన్నో- ఒక్కొక్కటిగా వెలుగులోకి! - YSRCP Leaders Attack

పల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజు ఆ తర్వాత జరిగిన హింసాకాండకు సంబంధించి మొత్తం 150 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 1,666 మంది నిందితులుగా ఉన్నారు. 100 మంది అరెస్టయ్యారు. వీరిలో 20 మంది బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇంకా 80 మంది 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. మారణాయుధాలతో దాడి, హత్యాయత్నం, ప్రజాప్రాతినిధ్య చట్టం తదితర సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో వీరంతా జైల్లో ఉన్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలకు కారణమైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై ఆయన హైకోర్టును ఆశ్రయించి జూన్‌ 6 వరకూ అరెస్టు కాకుండా రక్షణ పొందారు. హత్యాయత్నం కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. దీనిపైన ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. తుమృకోట, జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం కేసుల్లో 10 మంది బెయిల్‌పై బయటకు వచ్చారు.

మాణిక్యరావును కాపాడేదెవరు?- డీజీపీ ఆదేశాలతో ఎట్టకేలకు జీరో ఎఫ్ఐఆర్ - Manikya Rao Complaint

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో 728 మంది నిందితులుగా ఉండగా ఇప్పటివరకూ 102 మంది అరెస్టై 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. మారణాయుధాలతో దాడి, అల్లర్లు, హత్యాయత్నం కేసుల్లో వీరంతా జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో నిందితుడైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ అస్మిత్‌రెడ్డి మాత్రం హైకోర్టును ఆశ్రయించి జూన్‌ 6 వరకూ అరెస్టు కాకుండా రక్షణ పొందారు.

తిరుపతి జిల్లాలో నమోదైన 4 కేసుల్లో 14 మంది అరెస్టవ్వగా ఒక్కరికీ బెయిల్‌ రాలేదు. అందరూ పది రోజులుగా జైల్లోనే ఉన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి గ్రామాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నారు. ఈ సంఘటనల్లో 37 మందిపై కేసు నమోదు చేశారు. ఒక్కర్నే అరెస్టు చేయగలిగారు.

ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలి : టీడీపీ - GV Anjaneyulu Comment

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని నిందితుడిగా చేర్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేయలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు అవినాష్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్సీపీ శ్రేణులు సీబీఐ బృందాలను అడ్డుకున్నాయి. సీబీఐకి అవసరమైన సహకారం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవినాష్‌కు సహకరించి అరెస్టు కాకుండా కాపాడింది. ఈలోగా అవినాష్​ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు మీద పిటిషన్లు దాఖలు చేశారు. అనుభవం, ఖరీదైన న్యాయవాదుల్ని తీసుకొచ్చి వాదనలు వినిపించి ఆయన ఉపశమనం పొందారు. ఒక్క క్షణం కూడా జైలుకు వెళ్లలేదు. కేవలం సాంకేతికంగా కాగితాలపై మాత్రమే అరెస్టయ్యారు.

'మాపై ఒత్తిడి ఉంది' - పిన్నెల్లి బాధితుల ఎఫ్‌ఐఆర్ తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులు - Police Rejected Pinnelli Victim FIR

మొత్తంగా ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు కేసుల్లో ఉపశమనం పొందుతుంటే ఆయా పార్టీల్లో ఉన్న సామాన్యులైన అనుచరులు, కార్యకర్తలు తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. గురజాల నియోజకవర్గం మోర్జంపాడులో జరిగిన రాజకీయ ఘర్షణలకు సంబంధించి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఇటీవల అరెస్టు చేయగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. ఇలా ఎంతో మంది విద్యావంతులైన యువకులూ బలైపోతున్నారు. ఒక్కసారి కేసుల్లో చిక్కుకుంటే వారికి ఉద్యోగాలు రావు. యాంటిసిడెంట్‌ సర్టిఫికెట్లు లభించవు. విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవు.

ABOUT THE AUTHOR

...view details