Man Beaten To Death Over Land Dispute at Narayanpet Dist :నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో భూతగదా విషయంలో దాయాదులు యువకునిపై దాడిచేసి దారుణంగా హత్యచేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అతనిపై దాయాదివర్గం దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు పట్టించుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్న విమర్శలు వెల్లువెత్తడంతో పోలీస్‌శాఖ ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది.
Land Dispute Murder at Narayanpet District Updates :ఈ క్రమంలోనే శాంతి భద్రత పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఊట్కూరు ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి నలుగుర్ని అరెస్ట్ చేశారు. గువ్వలి చినసంజప్ప, గుడ్డి ఆశప్ప, గువ్వలి శ్రీను, గువ్వలి కిష్టప్పలు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా, మరో ముగ్గురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.
దాయదుల నుంచి రక్షణను కావాలన్న బాధితులు :హత్యకు గురైన యువకుడు సంజప్ప మృతదేహానికి శవపరీక్ష అనంతరం చిన్నపొర్లకు చేరుకోగా మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. ఊట్కూరు ఎస్సై సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదంటూ ఆందోళనకు దిగారు. ఎస్సైని సస్పెండ్ చేయడంతో పాటు దాయాదుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
Land Dispute Murder in Telangana :ఎస్సైని సస్పెండ్ చేశామని, దాయాదుల నుంచి రక్షణ కల్పిస్తామని వారికి డీఎస్పీ వివరించారు. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని అవసరమైతే పీడీ యాక్ట్, రౌడీషీట్ తెరుస్తామని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
నారాయణపేట జిల్లా చిన్నపొర్లకి చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు బాలమ్మ, తిప్పమ్మ ఇద్దరు భార్యలు. మొదటిభార్య బాలమ్మకి సంజప్ప కుమారుడు ఉండగా రెండో భార్య తిప్పమ్మకు పెద్దసౌరప్ప, చిన్న సౌరప్ప ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మప్ప ఉన్న 9 ఎకరాలను ముగ్గురు కుమారులకు సమానంగా పంచారు. ఇద్దరు భార్యలకి సమానంగా పంచితే చెరి నాలుగున్నర ఎకరాలు రావాలన్న అంశంపై రెండు కుటుంబాల మధ్య భూ వివాదం చెలరేగింది. ఏళ్లుగా ఆ వివాదం కొనసాగుతోంది. 2022లో మొదటి భార్య కుటుంబసభ్యులు కోర్టుని ఆశ్రయించారు. ఇరుకుటుంబాలు తరచూ దాడులుచేసుకోవడం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడం పరిపాటిగా మారింది.