ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన - లక్ష మందితో బహిరంగ సభ

వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ - ప్రధాని కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్‌

PM Modi to visit Visakhapatnam on November 29th
PM Modi to visit Visakhapatnam on November 29th (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

PM Narendra Modi AP Tour 2024 : ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్​లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనను ఏపీ సర్కార్ ప్రాధాన్యంగా తీసుకుంది. లక్ష నుంచి లక్షన్నర మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Modi Vizag Tour :సభ ఏర్పాట్లు, రోడ్డు షో నిర్వహణపై విశాఖపట్నం కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ ఆదివారం కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఎంపీ శ్రీభరత్, విప్‌ గణబాబు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేశ్‌బాబు తదితరులు హాజరయ్యారు. సిటింగ్, తాగునీరు, ఆహారం, వసతుల కల్పనపై వారితో చర్చించారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నందున తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ప్రధాని పర్యటనపై ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం ప్యాకేజీ ప్రకటిస్తారేమోనని ఆశిస్తున్నారు. రాష్ట్రంపై ఎలాంటి వరాలు కురిపిస్తారోనన్న చర్చ జరుగుతోంది.

ఇదీ షెడ్యూల్‌ :ఈ నెల 29న సాయంత్రం 3:40 గంటలకు ప్రధాని మోదీ వాయుమార్గంలో ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు లేదా వాయుమార్గంలో సభావేదికకు చేరుకుంటారు. రోడ్డుమార్గంలో వస్తే ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి కాన్వెంట్‌ కూడలి, రైల్వేస్టేషన్, సిరిపురం కూడలి మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలోని సభాస్థలికి చేరుకుంటారు. మధ్యలో టైకూన్‌ కూడలి నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్డు షో నిర్వహించే అవకాశముంది.

4:45 గంటల నుంచి 5 గంటల మధ్య వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుంటాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రసంగాల తర్వాత 5:25 గంటల నుంచి 5:45 గంటల వరకు ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విమానాశ్రయానికి తిరుగు పయనమవుతారు. అయితే, ఈ సభకు వరణుడు కొంత అడ్డంకిగా మారవచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఆ రోజు భారీ వర్షం కురిసే అవకాశమున్నందున సభ నిర్వహణపై కొంత సందిగ్ధం నెలకొంది.

Narendra Modi: భారత ప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యమిస్తాం: ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని మోదీ నోట ప్రకాశం జిల్లా మహిళా రైతు పేరు - కరువునేలపై సిరులు పండిస్తున్న కొమ్మలపాటి వెంకటరమణమ్మ

ABOUT THE AUTHOR

...view details