Bibinagar AIIMS Using Drones Services: వైద్య రంగంలో సరికొత్త విధానానికి బీబీనగర్ ఎయిమ్స్ శ్రీకారం చుట్టుంది. ఇక్కడ డ్రోన్ సేవలు మంగళవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. వివిధ ఆరోగ్య కేంద్రాల నుంచి వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన నమూనాలను తీసుకురావడానికి ఈ డ్రోన్లను వినియోగిస్తారు. ప్రధాని మోదీ దిల్లీలోని ఏఐఐఏ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. ఎయిమ్స్ ఆడిటోరియంలో డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెరపై కార్యక్రమాన్ని వీక్షించారు.
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో దేశవ్యాప్తంగా రూ.12,850 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇక్కడి డ్రోన్ కార్యకలాపాలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఎయిమ్స్ సమీపంలో డ్రోన్లను వికాస్ భాటియా వివరించి, రెండు డ్రోన్లను పరిశీలించారు. సమీపంలో ఉన్న పీహెచ్‌సీలకు రెండు డ్రోన్లు పంపించారు. అక్కడి నుంచి సిబ్బంది పంపించిన టీబీ నమూనాలను పరీక్ష కోసం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డీడీ బిపిన్ వర్గీస్, మెడికల్ పర్యవేక్షకుడు అభిషేక్ అరోరా, డాక్టర్లు సంగీతా సంపత్, నితిన్ జాన్, రష్మీ కుందాపూర్ శ్యామల, ఐసీఎంఆర్ ప్రతినిధులు సుమిత్ అగర్వాల్, కుల్దీప్, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, వేముల అశోక్, జిల్లా క్షయ అధికారి డాక్టర్ సాయి శోభ, డ్రోన్ నిర్వాహక సిబ్బంది పాల్గొన్నారు.
డ్రోన్‌తో ఏపీలో వైద్య సేవలు: వైద్య సేవల్లో డ్రోన్ల వినియోగానికి సంబంధించి ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. మంగళగిరి నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సేకరించిన రక్త నమూనాల్ని డ్రోన్ ద్వారా తీసుకువచ్చారు. ఇకపై రక్త నమూనాల సేకరణతో పాటు ఇతర అత్యవసర వైద్య సేవల్ని డ్రోన్ సాయంతో సులువుగా అందించొచ్చని అక్కడి ఆసుపత్రి సంచాలకులు తెలిపారు.