Amrabad Tiger Reserve As Plastic Free Zone :నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత జోన్‌గా ప్రకటించింది. జులై ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిబంధనల ప్రకారం ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వినియోగించకూడదు. నీళ్ల బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, ఆహార పొట్లాలు ఇవేవీ పులుల అభయారణ్యంలోకి తీసుకువెళ్లేందుకు వీల్లేదు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో హాజీపూర్ తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రారంభమవుతుంది. శ్రీశైలం వెళ్లే వరకూ నల్లమల అభయారణ్యం నుంచే ప్రయాణం సాగుతుంది. ఈ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు నిత్యం కిలోల కొద్ది ప్లాస్టిక్‌ను మార్గ మధ్యలో వదిలేస్తున్నారు. దీనివల్ల వన్యప్రాణులతోపాటు పర్యావరణానికి హాని కలుగుతోంది.
ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పడు ఆ చెత్తను ఏరి రీసైక్లింగ్ కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇకపై అలా కాకుండా అడవిలోకి అసలు ప్లాస్టిక్‌నే అనుమతించకుండా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక ప్రజలకు, దుకాణాదారులకు, ప్రయాణfకులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. జనం నుంచి సైతం ఈ నిర్ణయంపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
"ప్లాస్టిక్ తింటే జంతువులు చనిపోతున్నాయి. వాతావరణానికి కూడా చాలా హాని కలుగుతుంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడం మంచిదే. కానీ మరోవైపు కూడా ఆలోచించాలి. ఎందుకంటే దుకాణాదారులు వీటిపై ఆధారపడి ఉన్నారు. అక్కడక్కడ వాటర్ పెట్టాలి. ప్లాస్టిక్ నిషేంధించినప్పుడు దాని ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి." - పర్యటకులు