Pig Fight Competition Held at Tadepalligudem in West Godavari District : సాధారణంగా సంక్రాంతి పండగ సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు, పొట్టేళ్ల పోటీలు చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా అక్కడ పందుల పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో హాజరై వీక్షిస్తుంటారు. ఇంతకీ ఈ పోటీలు ఎక్కడంటే!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలను నిర్వహించారు. మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. కత్తులు కట్టని, ప్రాణహాని లేని ఈ పోటీలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుంచి వారికి పూర్తిస్థాయిలో మద్దతు కావాలని నిర్వాహకుడు సింగం సుబ్బారావు తెలియజేశారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పందుల మధ్య పోటీలు రసవత్తరంగా జరిగాయి. నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామం, కోనసీమ జిల్లా వలస గ్రామం మధ్య పోటీలు నిర్వహించగా బుచ్చి గ్రామానికి చెందిన పంది విజేతగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లాలో తిరుపతిపాడు, కొమ్ముగూడెం గ్రామాల పందుల మధ్య పోటీ నిర్వహించగా తిరుపతిపాడుకు చెందిన పంది విజేతగా రెండవ స్థానంలో నిలిచింది.